తాజ్‌మహల్ చుట్టూ అనేక అద్భుత కథలు ఉన్నాయి. అదే విధంగా.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆ అద్భుత కట్టడం చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి. తాజాగా.. అవి మళ్లీ బయటకొచ్చాయి. తాజ్ మహల్ కింద ఉన్న గదుల్లో దేవుడి విగ్రహాలు ఉన్నాయని వాదనలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇందులో నిజమెంత? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులు ఏమంటున్నారు?
భార్య ముంతాజ్ మరణానంతరం, ఆమె జ్ఞాపకార్థం అద్భుత పాలరాతి కట్టడంగా తాజ్ మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు. 1631లో ఈ నిర్మాణం ప్రారంభమై 1653లో పూర్తయింది. అంటే, ఈ అద్భుతం రూపుదిద్దుకోవడానికి దాదాపు 22 ఏళ్ల సమయం పట్టింది. తాజ్ మహల్చుట్టూ ఎన్నో కథలు అల్లుకుని ఉన్నాయి. తాజ్ మహల్ ఉన్న స్థలంలో తొలుత ఓ శివాలయం ఉండేదని ఇప్పటికీ అనేకమంది విశ్వసిస్తూ ఉంటారు. శివాలయాన్ని కూల్చేసి.. తాజ్ మహల్‌ను నిర్మించారని అంటారు. కాగా.. తాజ్ మహల్ కింది భాగంలో ప్రత్యేక గదులు ఉన్నాయని, వాటిల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని ఊహాగానాలు జోరుగా సాగేవి.తాజాగా.. తాజ్ మహల్ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు రాజ్నీష్ సింగ్. తాజ్ మహల్లో 22 గదులకు సీల్ వేసి ఉన్నాయని, వాటిని తెరవాలని అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. 22 గదులను తెరిస్తే.. తాజ్ మహల్ వాస్తవాలు, నిజాలు బయటపడతాయని వివరించారు. మూసివేసిన గదుల్లో దేవుడి విగ్రహాలు ఉన్నాయని ఎన్నో దశాబ్దాలుగా ప్రచారం సాగుతోంది.ఈ వ్యవహారంపై గురువారం విచారణ చేపట్టిన అలహాబాద్ కోర్టు.. రాజ్నీష్ పిటిషన్‌ను కొట్టివేసింది. ‘ఇది కోర్టు బయట జరిగే వ్యవహారం.
దీనిని చరిత్రకారులకే వదిలేయడం మంచిది,’ అని కోర్టు పేర్కొంది.తాజ్ మహల్.. ప్రస్తుతం ఏఎస్ఐ(ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) పరిరక్షణలో ఉంది. తెరపైకి వచ్చిన వివాదంపై తాజాగా ఏఎస్ఐ అధికారులు స్పందించారు.”తాజ్ మహల్లో 22 గదులు లేవు. 100కుపైగా ‘సెల్స్’ ఉన్నాయి. వివిధ కారణాలతో వాటిని మూసివేశారు. పిటిషనర్ చెప్పినట్టు ఇక్కడ ఏం లేదు. ఆ 22 సెల్స్ కూడా ఎప్పుడూ మూసివేసే ఉండవు. వివిధ పనుల కోసం వాటిని ఇటీవలే తెరిచాము. ఇన్ని దశాబ్దాలుగా మేము రికార్డులను తయారు చేస్తున్నాము. తాజ్ మహల్ కింద్ విగ్రహాలు ఉన్నాయని చెప్పేందుకు ఎక్కడా మాకు ఆధారాలు లభించలేదు,” అని ఏఎస్ఐ అధికారులు చెప్పారు.