వేసవి తాపం నుంచి ప్రజలకు కాస్త త్వరగానే ఉపశమనం కలగనుంది. నైరుతి రుతుపవనాలు ఈసారి దేశంలో ముందుగానే ప్రవేశించనున్నాయి. అదే సమయంలో వర్షాలు కూడా ఎక్కువేనంటోంది వాతావరణ శాఖ..
దేశ ప్రజలకు ఐఎండీ గుడ్న్యూస్ అందించింది. వేసవి తాపం నుంచి ముందుగానే ఉపశమనం లభించనుందనేది ఆ వార్త. ప్రతియేటా జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తుంటాయి. ఈసారి మాత్రం కాస్త త్వరగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా అంటే మే నెలాఖరులోగా ప్రవేశించవచ్చని అంచనా.
ముందుగా అండమాన్ నికోబార్ దీవుల్ని తాకి..అక్కడ్నించి కేరళ, ఇతర ప్రాంతాల్లో ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో ఈసారి వర్షపాతం కూడా సాధారణం కంటే ఎక్కువే ఉంటుందనేది మరో అంచనా. 96 శాతం నుంచి 104 శాతం నమోదు కావచ్చని తెలుస్తోంది.ఉత్తర భారతదేశం, మధ్య భారతం, హిమాలయాలు సహా..ఈశాన్య రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. కేరళ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా నమోదు కావచ్చు.