దేశంలో ఓ వైపు కోరనా వైరస్ కేసులు మళ్ళీ భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ టెర్రర్ పుట్టిస్తోంది. ఈ నేపధ్యంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రత .. క్లినికల్ డ్రగ్స్‌తో చికిత్స విధానం గురించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
చిన్న పిల్లలు, 18 ఏళ్లలోపు యువతీయువకుల కోసం కోవిడ్-19 కు చికిత్స విధానంలో సవరించిన సమగ్ర మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. ఐదేళ్లు లోపు వయసు ఉన్న పిల్లలకు మాస్క్‌లు సిఫార్సు చేయడం లేదని కూడా పేర్కొంది. అయితే తల్లిదండ్రుల పర్యవేక్షణలో 6ఏళ్ల నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సురక్షితంగా, సరైన పద్ధతిలో మాస్క్‌లను ఉపయోగించవచ్చని పేర్కొంది. 12 ఏళ్లు పైబడిన వారు పెద్దల మాదిరిగానే మాస్క్‌లు ధరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల, ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య నిపుణుల బృందం మార్గదర్శకాలను సమీక్షించింది. ఒమిక్రాన్ వేరియంట్ల వల్ల వచ్చే వ్యాధి తీవ్రతను ఇతర దేశాలలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చూస్తే.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ మహమ్మారి సులభంగా ఒకరి నుంచి మరొకరి వ్యాపించే గుణం ఉన్నందున తగిన పర్యవేక్షణ అవసరమని తెలిపింది. ఐదేళ్ల లోపు పిల్లలు మాస్క్‌లు సరిగా ధరించలేకపోతున్నారని, అందుకే మాస్క్‌లు ధరించవద్దని సూచించామని ఢిల్లీలోని బీఎల్ కపూర్ హాస్పిటల్‌లోని సీనియర్ చిల్డ్రన్స్ డాక్టర్ రచనా శర్మ తెలిపారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు సహా యునిసెఫ్ రిలీజ్ చేసిన మార్గదర్శకాలలో చిన్న పిల్లలు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని చెప్పారు.