మారుమోగుతోన్న మొగులయ్య పాట

భీం భీం భీం భీం భీమ్లానాయక్’ రెండు రోజుల నుంచి మీడియా, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ సినిమా ఫస్ట్ సాంగ్‌ రిలీజ్ చేశారు. థమన్, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిర్యాల నలుగురూ కలిసి ఈ పాట పాడారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ పాట మొదట్లో సాకి పాడిన వ్యక్తి ఎవరబ్బా.. ఇంతకుముందు ఏవైనా సినిమాల్లో పాడారా అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌తో పాటు సాకి పాడిన వ్యక్తి గురించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఈ పాటను అంటూ అద్భుతంగా పాడారు మొగులయ్య. ఆయన వాయిస్, పదాలను పలికిన విధానం ఈ జెనరేషన్ వారిని కూడా ఆకట్టుకుంటున్నాయి. మొగులయ్య.. ప్రముఖ తెలంగాణ జానపద గాయకుడు, 12 మెట్లు కిన్నెర వాద్య కళాకారుడు..నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట మొగులయ్య స్వస్థలం. తండ్రి దగ్గరే ఆ కళను నేర్చుకున్న మొగులయ్య.. తన మేధాశక్తితో 7 మెట్ల కిన్నెర స్థానంలో ఆనపకాయ బుర్రలను వెదురుబొంగుకి బిగించి 12 మెట్ల కిన్నెరను తయారు చేశారు. మొగులయ్య తన కళను కేవలం వీరగాథలకు మాత్రమే అంకితమిచ్చారు. పాలమూరు జిల్లాలో ‘పండుగ సాయన్న’, ‘మియాసాబ్’, ‘శంకరమ్మ’, ‘వనపర్తి రాజుల కథలు’ అద్భుతంగా చెప్పేవారు. సమాజాన్ని చైతన్య పరిచేలా మొగలయ్య కథలు చెప్తుంటే వినే వారికి రోమాలు నిక్కబొడుచుకునేవి. ముందు నుంచి తన సినిమాల్లో జానపద గేయాలను సందర్భానికి అనుగుణంగా వాడే పవన్ కళ్యాణ్‌ను ‘భీమ్లా నాయక్’ గా ఎలివేట్ చేసే పాటలో అలాంటి పదాలు ఉంటే బాగుంటుందనుకుని, మూవీ టీం.. మొగులయ్య గురించి తెలుసుకుని ఆయన పాడిన ఓ పాటని ఆధారంగా చేసుకుని.. ఆ పదాలను వాడుతూ సాకిలో రామజోగయ్య శాస్త్రి మార్పులు చెయ్యగా మొగులయ్య అద్భుతంగా పాడారు. ఈ పాటతో ఆయనకు మరింత గుర్తింపుతో పాటు మరిన్ని అవకాశాలు కూడా వస్తాయి.. పాలమూరు మట్టి బిడ్డకు ఇంత మంచి అవకాశం రావడంతో ఆయనను ఘనంగా సన్మానించారు కల్వకుర్తి వాసులు.

Load More Related Articles
Load More By admin
Load More In మూవీస్

Leave a Reply

Your email address will not be published.