భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీల వార్డును, మిడ్ వైఫ్ పనితీరును పరిశీలించారు సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న క్షయ నివారణ కేంద్రంను పరిశీలించి అక్కడి వైద్యుల పనితీరును ఆమె అడిగి తెలుసుకున్నారు.
ముందుగా భద్రాచలం చేరుకున్న ప్రభుత్వ ఉన్నాతాధికారులు శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీహెచ్సీని గిరిజన సంక్షేమ కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చాంగ్తూ, ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, మెడికల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యలతో కలిసి స్మితా సబర్వాల్ స్వామివారిని దర్శించుకున్నారు. సీతా రామాలయం అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అధికారులకు అమ్మవారి ఆలయంలో వేదపండితులచే వేదాశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపికలు అందచేశారు. అనంతరం గర్భిణీ స్త్రీల వార్డును పరిశీలించి, డెలివరీ సమయంలో ఆసుపత్రిలో ఇటీవల ప్రారంభించిన మిడ్ వైఫ్ నర్సింగ్ విధానాన్ని వారి పనితీరును అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు,సలహాలు చేశారు స్మితా సబర్వాల్.