అనుభవం ఎంతటి పాటన్ని నేర్పుతుందో తెలియనిది కాదు. మనిషిని మరింత రాటుదేల్చుతుంది. చరిత్రను అవగతం చేసుకొని నడుచుకోవాలే కాని అదే చరిత్రను తిరగరాయాలని చూస్తె ఎంతటి ఉద్దండులైనా చావు దెబ్బతినాల్సిందే. రాజకీయాల్లో ఉన్నవారు ఈ విషయంలో కాస్తా అజాగ్రత్తగా వ్యవహరించినా భవిష్యత్ కు కూడా భంగం కల్గుతుంది. రాజకీయాల్లో ఎంతో అనుభవం పొందిన కేసీఆర్ కు ఆ విషయం తెలియనిది కాదు..కాని అలాంటి కేసీఆరే ఇప్పుడు చరిత్రను తిరగారాయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సులువు కాదని ఆయన అనుభవం చెబుతున్నా…మొండిగా అడుగులు వేస్తున్నారు.
హుజురాబాద్ బైపోల్ లో గెలిచేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈటలను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు…2001లో సిద్దిపేట ఉప ఎన్నిక కోసం నాటి సీఎం చంద్రబాబు పడిన కష్టాలను గుర్తు చేస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పదవికి రాజీనామా చేశానని చెప్పారు కేసీఆర్..కాని అసలు కారణం మాత్రం చంద్రబాబు కేబినేట్ లో ఆయనకు చోటుకల్పించకపోవడంతోనే పదవికి రాజీనామా చేశారని చాలా మంది అంటుంటారు. దాంతో తనకు పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారని, ఓ రకంగా అవమానించారని భావించి కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చారని ఆయనతో సన్నిహితంగా మెలిగిన నేతలు చెప్పే మాట.
నాడు చంద్రబాబు కేసీఆర్ను ఎలాగైతే అవమానించారో… ఇప్పుడు కేసీఆర్ ఈటలను సరిగ్గా అలాగే బయటకు వెళ్లేలా చేశారు. అయితే నాడు చంద్రబాబు పదవి ఇవ్వకుండా కేసీఆర్ను అవమానిస్తే.. ఇప్పుడు కేసీఆర్ పదవి ఇచ్చి, ఈటలను ఆ పదవి నుంచి తొలగించి దారుణంగా అవమానించారు. నాడు కేసీఆర్ రాజీనామాతో ఆయనను ప్రజా క్షేత్రంలోనే ఓడించి చావు దెబ్బతీయాలని చూశారు చంద్రబాబు. ఓ రకంగా తమను ఎదురిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఉప ఎన్నికల ద్వారా చెప్పాలని అనుకున్నారు. సిద్ధిపేట కేంద్రంగా కోట్లు కుమ్మరించారు. కాని ఉప ఎన్నికల్లో ప్రజాబలం ముందు ధనబలం ఓడిపోయింది. ఇప్పుడు సరిగ్గా చంద్రబాబు ప్లేసులో కేసీఆర్ ఉన్నారు. ఈటలను ఓడించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గానికి నిధుల వరద పారిస్తున్నారు. పదవులు ఇస్తున్నారు. కాని స్వీయనుభావాన్ని మరిచిన కేసీఆర్ ఈటలను ఓడించేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ప్రజలు తాత్కాలిక ప్రేమకు లొంగరని చరిత్ర చెబుతున్నా..ఆయన మాత్రం మొండిగా ముందుకే పోతుండటం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. చరిత్రను తిరగరాయాలని తపిస్తోన్న కేసీఆర్…నిజంగా చరిత్రను తిరగారస్తారా.. చూడాలి..?