హుజురాబాద్ లో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈటల రాజేందర్ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తున్నారు. ఇక, మేమైనా తక్కువ తిన్నామా అంటూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీను కూడా ప్రచారాన్ని షురూ చేశారు. కాని కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని ఖరారు చేసే విషయం దగ్గరే ఇంకా ఆగిపోయింది. కొన్ని రోజులపాటు కొండా సురేఖను బరిలో నిలుపుతారని ప్రచారం జరిగింది. కాని పోటీలో ఉండేందుకు ఆమె ఆసక్తిగా ఉన్నారా..? అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు.
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ఫిక్స్ అని ప్రచారం జరిగింది. ఇక అధికారిక ప్రకటన్యూ మిగిలింది అనుకుంటున్నా సమయంలోనే టీ.పీసీసీ అభ్యర్థి విషయాన్నీ మళ్ళీ మొదటికి తీసుకువచ్చింది. హుజూరాబాద్ లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రతిపాదన పెట్టింది. హుజురాబాద్ లో ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించి తాడోపేడో తెల్చుకుంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. కట్ చేస్తే మళ్ళీ ఇదివరకు లాగే మళ్ళీ సీన్ మొదటికే తీసుకువచ్చారు.
ఈ అయోమయాన్ని… కాంగ్రెస్ పార్టీ సత్వరమే తగ్గించుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. రేవంత్ రాకతో కలిగిన జోష్ ను.. జయాపజయాలతో సంబంధం లేకుండా హుజూరాబాద్ వేదికగా ముందుకు తీసుకుపోకుంటే.. పార్టీలో లుకలుకలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అది రేవంత్ నాయకత్వానికి సైతం కాస్త ఇబ్బందిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే అభిప్రాయాన్ని.. కాంగ్రెస్ నేతలు ఆఫ్ ద రికార్డ్ గా వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా అభ్యర్థి విషయంలో త్వరగా స్పష్టత తీసుకువస్తే.. కార్యకర్తలు కూడా యాక్టివ్ అవుతారు. ఈ తరుణంలో.. ఈటల, గెల్లును ఢీ కొట్టగలిగే నేత కాంగ్రెస్ నుంచి ఎవరు కాబోతున్నారు? హుజూరాబాద్ లో హస్తం భవిష్యత్తును ఎవరు ప్రభావితం చేయబోతున్నారు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..