తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి చేసే ప్రకటనలకు, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. తెలంగాణ జీడీపీ బాగుందని మంత్రి హరీష్ కితాబిస్తుంటే…ముఖ్యమంత్రి ఏమో ఆర్ధిక సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు సర్కార్ భూములను అమ్మేస్తుండటం విస్మయాన్ని కల్గిస్తోంది. అంత బాగుంటే సర్కార్ భూములను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఖానామెట్, కోకాపేటలో హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీకి చెందిన భూములను అమ్మేసింది. దాదాపు రూ.2 వేల కోట్ల నిధులను రాబట్టుకుంది. ఆ నిదులనే హుజురాబాద్ లో ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక మరోసారి భూములు అమ్మే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. ఈసారి తెలంగాణ స్టేట్ ఇండస్టీస్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ కు చెందిన ఖానామెట్, పుప్పాలగూడల్లోని భూములను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి రేపు నోటిఫికేషన్ జారీకానుంది. వచ్చే నెల 9న ఫ్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించి తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థలు, ఏజెన్సీల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను 25 వరకు చేపట్టి.. అదే రోజు సాయంత్రం ఈఎండీ చెల్లించిన సంస్థలతో వచ్చే నెల 27, 28 తేదీల్లో ఆక్షన్ నిర్వహించేందుకు సిద్దమైంది తెలంగాణ ప్రభుత్వం. ఖానామెట్ లో 27.79 ఎకరాల్లోని 9 ప్లాట్లు, పుప్పాలగూడలోని 94.56 ఎకరాల్లోని 26 ప్లాట్లను విక్రయించనుంది. వచ్చే నాలుగు నెలల్లో మొత్తం వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.