పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసి తీరుతామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ ఇదే పాట పాడారు. కాని అక్కడక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నా, ఉన్నవి కాస్తా టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే దక్కుతున్నాయనే అభిప్రాయం ఉంది. అసలు లబ్దిదారులకు సొంతింటి కళ సాకారం కష్టమేనని అంటున్నారు సామాన్యులు. గుడిసెలో బతుకుతున్న తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని ఆశ చూపి…ఎన్నికల్లో గెలిచాక లీడర్ల అసలు నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారని మండిపడుతున్నారు అక్కడి గుడిసె వాసులు.
ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తోన్న ఈ గుడిసెలు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి సమీపంలోనివి. సరైన గూడు లేక పలువురు ఇలా గుడిసెలు ఏర్పాటు చేసుకొని బతుకుతున్నారు. గుడిసెల్లో భయభయంగా బ్రతుకుతున్నారు. రాత్రిళ్ళు ఏ విష సర్పం కాటు వేస్తుందోననే ఆందోళనతో దినదిన గండం బతుకు చిద్రంగా వారి జీవనం కొనసాగుతుంది. పాలకులు చెబుతున్నా బంగారు తెలంగాణలో వారికీ కాసింత గూడు లేకపోయింది. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందడమంటే నాలుగు ఫ్లై ఓవర్లు, ఆరు అంతస్తుల భవనాలు కాదని అంటున్నారు గుడిసె వాసులు. ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గుడిసె వాసులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చి…తీరా గెలిచాక ఇటు వైపు చూడటమే మానేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. పైగా..ప్రస్తుతం గుడిసెల స్థలం ఖాళీ చేయాలనీ ఇక్కడ ఆశ్రయం పొందుతున్న 30 కుటుంబాలను బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు మహిళలు. తమకు న్యాయం చేయాలనీ గుడిసె వాసులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రజా సమస్యల పట్ల తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గుడిసె వాసుల వద్దకు కాంగ్రెస్ నేత నాని యాదవ్ వెళ్లి మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వారికీ అభయం ఇచ్చారు.