వైఎస్ఆర్ టీపీకి పెద్ద దిక్కుగా ఉన్న షర్మిల, ఇందిరా శోభన్ కలిసి చేయడం సాధ్యం కాదని స్పష్టం అయింది. ఆ పార్టీకి ఇందిరాశోభన్ రాజీనామా చేశారు. ఆమె తొందరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారని ప్రచారం జరిగినా..ఇంత తొందరగా జరుగుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇంతకి ఇందిరా శోభన్ వైఎస్సార్టీపీకి ఎందుకు రాజీనామా చేసినట్టు..?కారణం ఏమై ఉంటుంది..?రీడ్ దిస్ స్టొరీ..
తెలంగాణ రాజకీయాల్లో మహిళా వక్తగా ఇందిరాశోభన్ కు మంచి పేరుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఆమె తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. షర్మిల తెలంగాణాలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించగానే ఎవరూ ఊహించనివిధంగా ఆమె షర్మిల పార్టీలో చేరిపోయారు. షర్మిల చేపట్టే కార్యక్రమాలు, జిల్లాల పర్యటనల్లో కీలకంగా ఉంటున్నారు .అయితే పార్టీలో పెద్ద నేతలెవరూ పెద్దగా లేకపోయినా.. కనీసం కాంగ్రెస్లో దక్కిన గౌరవం కూడా వైఎస్సార్ తెలంగాణ పార్టీలో దక్కడం లేదన్న అసంతృప్తి ఇందిరా శోభన్ లో ఉందని తెలుస్తోంది. పైగా షర్మిల వ్యవహారశైలితో ఇందిరా ఇబ్బంది పడినట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఇందిరా శోభన్ దూకుడు స్వభావం….ఆమె వ్యవహారశైలిపై కొంతమంది షర్మిల కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఇందిరా శోభన్ ను షర్మిల కొంచెం దూరం పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. పైగా తనకు రాజకీయం అనుభవం ఉండటంతో షర్మిలకు రాజకీయ విషయాల్లో సలహాదారుగా ఉండాలని భావిస్తే…పీకే శిష్యురాలు ప్రియను తీసుకురావడంతో ఇందిరా ప్రాధాన్యత మరింత తగ్గింది. ఇవన్నీ ఇందిరా శోభన్ కు ఇబ్బందికరంగా అనిపించడంతో ఆమె పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్కు కూడా బలమైన మహిళా గొంతు అవసరం ఉందని.. తిరిగి పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి కోరడంతో సొంత గూటికి ఇందిరా వెళ్లాలని అనుకుంటున్నారని సమాచారం. త్వరలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.