ఇదేనా ఫ్రెండ్లీ పోలిసింగ్-జర్నలిస్టులపై ఎస్సై చిందులు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి టూ టౌన్ ఎస్సై భాస్కర్ జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీసు స్టేషన్ తన గెస్ట్ హౌస్ అనుకున్నారో లేక, తన సొంత నివాసం అనుకున్నారో ఏమో కాని…తన అనుమతి లేకుండా స్టేషన్ లోపలికి ఎలా వస్తారని ఎస్సై జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగారు. తన అనుమతి తీసుకొనే స్టేషన్ లోపలికి అడుగు పెట్టాలని జర్నలిస్టులతో మాట్లాడిన మాటలు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వమేమో ఫ్రెండ్లీ పోలిసింగ్ అని చెప్తుంది. కాని ఆచరణలో మాత్రం పోలిసుల వ్యవహారశైలి భిన్నంగా కనిపిస్తోంది. అక్కడక్కడ పోలిసుల వ్యవహారశైలి ఆకట్టుకుంటున్నా…చాలా చోట్ల మాత్రం ఇదేం ఫ్రెండ్లీ పోలిసింగ్ అనేలా ఖాకీలు వ్యవహారశైలి కనిపిస్తోంది. తాజాగా కల్వకుర్తి టూ టౌన్ ఎస్సై భాస్కర్ జర్నలిస్టులతో వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ ఎం జరిగిందంటే…కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ క్యాంప్ కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఈ వార్తను కవర్ చేసేందుకు స్టేషన్ కు వెళ్ళినా జర్నలిస్టులతో టూ టౌన్ ఎస్సై అనుచితంగా మాట్లాడారు. నా పోలీసు స్టేషన్ లోకి మీరెలా వస్తారు..?మిమ్మల్ని లోపలికి ఎవరూ అనుమతించారు అంటూ జర్నలిస్టులపై చిందులు తొక్కారు ఎసై. వార్తను కవర్ చేసేందుకు వచ్చామని చెప్తున్నా వినిపించుకోకుండా పలువురు జర్నలిస్టులను బయటకు వెళ్ళిపోవాలని చెప్పడం…ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వడంతో ఎస్సైపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సై ఇది రాచరిక పాలన అనుకుంటున్నారా అంటూ పలువురు మండిపడుతున్నారు.

ప్రజాస్వామ్యయుతంగా వార్తను కవర్ చేసేందుకు వెళ్ళిన జర్నలిస్టులను స్టేషన్ లోకి ఎవరు రానిచ్చారు అని మాట్లాడుతారా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. జర్నలిస్టులతోనే అలా మాట్లాడితే…ఇక సామాన్యులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎస్సై ఎలా రీసివ్ చేసుకుంటారో అంటూ విమర్శిస్తున్నారు. ఆయన వైఖరిపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు జర్నలిస్టులు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.