ఆప్ఘాన్ తాలిబన్ల వశం కావడంతో ఆ దేశ ప్రజలంతా తలదాచుకునేందుకు తలోదిక్కు పారిపోతున్నారు. ఆప్ఘాన్ పై మమకారాన్ని చంపుకొని ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. కాని ఓ హిందూ పూజారి మాత్రం ఆప్ఘాన్ ను వీడేది లేదంటూ ఖరాఖండిగా చెప్తున్నాడు. ముస్లింల పాలనలో ముస్లింలకు రక్షణ ఉండదనే భయంతో ఇతర దేశాలకు వెళ్తుంటే…ఆ పూజారి మాత్రం అక్కడే ఉంటానని చెప్పడం అందర్నీ ఆచర్యానికి గురి చేస్తోంది.
పండిత్ రాజేశ్ కుమార్ అనే వ్యక్తి ఆప్ఘాన్ ను వీడేది లేదని తేల్చి చెబుతున్నాడు. తన ప్రాణాలు పోయినా పరవాలేదని చెప్తున్నాడు. కాబూల్‌లోని రత్తన్నాథ్ ఆలయంలో పూజరిగా పనిచేస్తున్న రాజేశ్ కుమార్.. చావైనా, బతుకైనా అక్కడేనని తెగేసి చెబుతున్నాడు. స్థానిక హిందూ సంస్థల ప్రతినిధులు రాజేష్ కుమార్ కు నచ్చజెప్తున్నా వినడం లేదు.
తమ ఖర్చులతో సురక్షితంగా తీసుకెళ్తామని చెబుతున్నా వద్దని వారిస్తున్నాడు రాజేష్ కుమార్. తన పూర్వీకులంతా ఆ ఆలయంలోనే వందల ఏళ్ల పాటు సేవలు అందించారని.. తన జీవితం కూడా అక్కడే ముగియాలని అంటున్నాడు. ఒకవేళ తాలిబాన్లు తనను చంపినా.. అది దేవుని సేవగానే భావిస్తానని చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.