ఏపీలో మళ్ళీ ప్రమాణాల పాలిటిక్స్ షురూ అయింది. ఇదివరకు టీడీపీ, వైసీపీ మధ్య కొనసాగిన ఈ ప్రమాణాల రాజకీయం…తాజాగా టీడీపీ ప్లేసులోకి బీజేపీ వచ్చి చేరింది. ఇక వైసీపీ, బీజేపీ మధ్య కొనసాగుతున్న ఈ ప్రమాణాల రగడ పీక్ స్టేజ్ కు చేరింది. కొద్దిరోజులుగా టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలో బీజేపీ, వైసీపీ మధ్య యుద్ధం నడుస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రమాణ రాజకీయం జరుగుతోంది.
బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై ప్రొద్దుటూర్ ఎమ్మెల్యే రాచమల్లు సంచలన ఆరోపణలు చేశారు. విష్ణు వర్ధన్ రెడ్డి ఆశ్రమం, మఠం వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. ఇందుకు విష్ణు వర్ధన్ రెడ్డి స్పందిస్తూ తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ను ఏ ఆశ్రమం, మఠం వద్ద నుంచి డబ్బులు వసూళ్లు చేయలేదని వేదపండితులు, అధికారులు, పార్టీ శ్రేణుల మధ్య కాణిపాకంలోని సత్యదేవుడు ముందు ప్రమాణం చేశారు. ఈ 23 ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నాననే తప్పితే…ఎప్పుడు అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.
తనపై ఆరోపణలు చేసిన ప్రొద్దుటూర్ ఎమ్మెల్యే రాచమల్లును ప్రమాణం చేయమని ఆహ్వానిస్తే ఎందుకు రాలేదని ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన మహిళలను అవమానపరిచారని…కాని ఆయనలా నేను చేయనని చెప్పారు. రాచమల్లు ఇంట్లోని ఆడబిడ్డలను కుటుంబ సభ్యులుగా భావించి పసుపు, కుంకుమ, చీర పంపుతానని చెప్పారు. దిగుజారుడు వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్న విష్ణు… రాచమల్లు కాణిపాకం ప్రమాణానికి రాకుండా పారిపోయారని విమర్శించారు. చెప్పిన మాట ప్రకారం తాను వచ్చి ప్రమాణం చేశానన్నారు. వైసీపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు విష్ణువర్ధన్ రెడ్డి.