కర్నూల్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయి పట్టపగలే యథేచ్ఛగా భారీ వాహనాల్లో తరలిస్తోంది. నదులు, వాగులు, వంకలను వదలకుండా ఇసుక తవ్వి జేబులు నింపుకుంటున్నారు. అసలే వానలు లేక అల్లాడిపోతుంటే…భూగర్భ జలాలు కూడా అడుగంటేలా ఇసుక అక్రమ రవాణా కొనసాగడంపై ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూల్ జిల్లా పెద్దకడబూరు మండలం దొడ్డి మేకలలో ప్రకృతి సహజ సంపద అయిన ఇసుకను అక్రమంగా దోచేస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, ధనార్జనే ధ్యేయంగా వీరు డ్రెడ్జర్లు, పొక్లెయినర్లతో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. యదేచ్చగా పట్టపగలు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంటే అధికారులు కూడా మాత్రం కిమ్మనకుండా ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో ఎక్కడా కూడా తనిఖీలు పెద్దగా జరగడం లేదు. ఫిర్యాదులు వస్తే మాత్రమే తనిఖీలను నామమాత్రంగా చేస్తున్నారు అధికారులు, పోలీసులు.