ఓవైపు నెలరోజుల నుంచి వరుణదేవుడు ముఖం చాటేశాడు. మరోవైపు బోరుబావుల కింద పంటలు రక్షించుకుందాం అంటే లోవోల్టేజీ కరెంటు సమస్యతో కళ్లెదుటే పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు….రైతుల కన్నీటి గాథలపై టీవీ6 స్పెషల్ స్టొరీ
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో సుమారు నెల రోజుల నుంచి వర్షం కోసం రైతులు ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. పంటలను బతికించుకోవాలని వరనుడి కరుణ కోసం వెయిట్ చేస్తున్నారు. సుమారు నెల రోజుల నుండి వరుణదేవుడు కరుణించకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఇదిలావుండగా నేల కోసిగి గ్రామ ఫీల్డర్ లో లోవోల్టేజీ సమస్యతో పాటు, కరెంటు కోతలు విధించడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వరుణదేవుడు కరుణించడం లేదు, మరో వైపు బోరు బావుల్లో నీళ్ళు కట్టుకుందామంటే కరెంటు సారువాళ్ళు కరుణించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోసిగి సమీపంలోని నెలకోసిగి ఫీడర్ నుంచి వందల ఎకరాలు బోరు బావుల కింద రైతులు పంటలు సాగు చేసుకున్నారు. గత 20 రోజుల నుంచి లోవోల్టేజ్ కరెంటు సమస్యతో బోరు మోటార్లు కాలిపోతున్నాయని… విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి బోరుబావుల కింద ఉల్లి, మిరప ,పత్తి ,వేరుశనగ పంటలు సాగు చేసుకున్నామని లోవోల్టేజ్ కరెంటు సమస్యతో కళ్ళముందే పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోవోల్టేజ్ కరెంటు సమస్యతో బోరు మోటర్ చెడిపోతే సుమారు పది వేల రూపాయలు ఖర్చు అవుతుందని పంటల పెట్టుబడి సమయంలో ఖర్చులు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోవోల్టేజ్ కరెంట్ సమస్యపై మండల విద్యుత్ అధికారి రవీంద్ర ను ఫోన్ ద్వారా వివరణ కోరగా మాధవరం విద్యుత్ స్టేషన్ ఐదు సబ్ స్టేషన్ లకు కరెంటు సరఫరా అవుతుండటం వల్ల లోవోల్టేజీ సమస్య ఏర్పడిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని కోసిగి సబ్ స్టేషన్ కు ఆదోని నుంచి పాత పద్ధతిలోనే విద్యుత్ సరఫరాకు నేటి నుండి అధికారులు అనుమతి ఇచ్చారని రేపటి నుంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని ఆయన తెలిపారు.