ఏడేళ్ళ అపజయాలు, వరుసగా పార్టీ ఫిరాయింపులు…పార్టీ నమ్మిన వారే నట్టేట్ట ముంచేస్తుంటే చూస్తూ ఊరుకోలేక లేచి నిలబడింది కాంగ్రెస్ దండు. నూతన నాయకత్వం ఇచ్చిన బూస్టింగ్ తో ఇంద్రవెల్లి వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. దిక్కులు పిక్కటిల్లేలా…ప్రత్యర్ధి గుండెల్లో వణుకు పుట్టించేలా దండోరాకు రెడీ అయింది కాంగ్రెస్. ప్రస్తుత పాలకుల అసమర్ధతను ప్రజలకు వివరించేందుకు మలిపోరాటంలో తొలి అడుగు వేయబోతోంది.
ఇంద్రవెల్లిలో జరగనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ తెలంగాణ వ్యాప్తంగా రీసౌండ్ ఇస్తోంది. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కాదన్నట్టుగా కాంగ్రెస్ క్యాడర్ పట్టు బిగిస్తోంది. నూతన ఉత్సాహంతో అడుగులు ముందుకు వేస్తోంది. ఈ ఏడేళ్ళలో కనిపించని ఉత్సాహం ఇప్పుడు కనిపిస్తోంది. చాలా కాలం తరువాత గ్రామ, గ్రామానా మళ్ళీ కాంగ్రెస్ జెండాలు పట్టుకున్న కార్యకర్తలే కనిపిస్తున్నారు. ఇంద్రవెల్లి సభకు తరలి వెల్దమంటూ…ఇంటింటికి వెళ్లి జనాలను ఆహ్వానిస్తున్నారు.
ఇది కాంగ్రెస్ లో కనిపిస్తోన్న నూతన ఒరవడి. కొత్త మార్పు. ఇదివరకు ఎప్పుడూ కనిపించని మార్పు ఇప్పుడు కనిపిస్తోంది. ఈ పరిస్తితిని చూసి జనమే ఆశ్చర్యపోతున్నారు. ఇదివరకు నిస్తేజం ఆవహించిన కాంగ్రెస్ లో ఇప్పుడు…రేవంత్ సారధ్య భాద్యతలు చేపట్టడంతో ఓ కొత్త రకం మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ రాకతో టి. కాంగ్రెస్ కొత్త జవసత్వాలు నింపుకుంటోంది. కొత్త రెక్కలు తొడుక్కుంటోంది. ఇంద్రవెల్లి సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పునర్వైభవం దిశగా అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సభ సక్సెస్ తో అధికార పక్షానికి హెచ్చరికలు పంపబోతోంది తెలంగాణ కాంగ్రెస్.