హుజురాబాద్ బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ బాస్…అక్కడి గెలుపు బాధ్యతలను ప్రధానంగా మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇంకా రాకపోయినా…ఆపరేషన్ హుజురాబాద్ సిద్ధిపేట కేంద్రంగా చేపట్టారు హరీష్. చాలా కాలం తరువాత కేసీఆర్ మరోసారి తనకు ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించడంతో హరీష్ రావు హుజురాబాద్ లో గులాబీ జెండా ఎగరేసేందుకు దారి తప్పుతున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. సహచర ఉద్యమకారుడిని ఓడించేందుకు ఏకంగా హరీష్ నే రంగంలోకి దింపారు కేసీఆర్. ఈటలపై దండయాత్రకు కేటీఆర్ ను పంపితే రాంగ్ మెసేజ్ పంపినట్లు అవుతుందని..పైగా అది ఈటలపై మరింత సానుభూతిని రాజేస్తుందని గ్రహించారు కేసీఆర్. దీంతో హరీష్ రావును హుజురాబాద్ పైకి దండయాత్ర చేసేందుకు అల్లుడు హరీష్ ను పంపారు. చాలా కాలంగా హరీష్ రావును పక్కనబెట్టిన కేసీఆర్…ఇప్పుడు ఈటల ఎపిసోడ్ లో మాత్రం అల్లుడిని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారని అంటున్నారు విశ్లేషకులు. హరీష్ భుజాల మీద గన్ పెట్టి ఈటల భవితవ్యాన్ని షూట్ చేస్తున్నారని అంటున్నారు. ఈటలను ఓడిచేందుకు హరీష్ రావు అమలు చేస్తోన్న విధానాలను చూసి స్వయంగా ఆయన అభిమానులే కలత చెండుతున్నారట.

మామ ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు సిద్ధిపేట కేంద్రంగా ఆపరేషన్ హుజురాబాద్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా హుజురాబాద్ నుంచి కీలక నేతలను, నాయకులను సిద్ధిపేటలోని తన కార్యాలయనికి రప్పించి టీఆర్ఎస్ కండువా కప్పేస్తున్నారు. పైగా కొంతమందిని నయానో భయానో బెదిరించి దారిలోకి తెస్తున్నారని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈటలను ఓడించేందుకు తనను కేసీఆర్ రంగంలోకి దింపడానికి గల కారణాలను అన్వేషించని హరీష్ రావు…ఈటలపై చేస్తోన్న యుద్దంలో ఆ ప్రతిష్టను పోగొట్టుకుంటున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఒకప్పుడు ప్రజలు హరీష్ ను గొప్ప ప్రజా నాయకుడిగా భావించేవారని… ఈటల ఎపిసోడ్ లో ఆయన వ్యవహరిస్తోన్న తీరుతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. హరీష్ రావే నేరుగా హుజూరాబాద్ పొలీస్ అధికారులకు ఫోన్ చేసి పలానా నాయకులను బెదిరించి మన దారికి తీసుకురండని చెబుతున్నారని… ఆ విషయాలు ప్రజల్లోకి వెళుతున్నాయని దాంతో ఆయనపై ఉన్న అభిమానం పోయి వ్యతిరేకత పెరుగుతోందని చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసే సరికి హరీష్ ఇమేజ్ పూర్తిస్థాయిలో దెబ్బ తినడం ఖాయమని బాధపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు దూరమవుతారని ఆందోళన చెందుతున్నారు.