కౌశిక్ ఎమ్మెల్సీ వ్యవహారం – తిరగబడుతున్న ఉద్యమ’కారు’లు

దశాబ్దాల నుంచి గులాబీ జెండా పట్టుకొని తిరుగుతున్నా ఉద్యమకారులకు ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కడం లేదు. ఉద్యమ సమయంలో జై తెలంగాణ అని నినదించిన ఉద్యమకారులను వదిలేసి…నై తెలంగాణ అని నినదించిన వారు ప్రత్యేక రాష్ట్రంలో మంత్రి పదవులను అనుభవిస్తున్నారు. అయినా ఎక్కడో చిన్న ఆశ…కేసీఆర్ ఎప్పటికైనా ఉద్యమ నేపథ్యాన్ని గుర్తించి ఏదైనా గుర్తింపు ఇవ్వకపోడా అని ఎదురు చూస్తున్నారు గులాబీ నేతలు, నిఖార్సైన ఉద్యమకారులు. కాని అవకాశం వచ్చినా ప్రతిసారి ఆ సీట్లో ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళే కూర్చోవడంతో ఉద్యమకారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. నాటి ఉద్యమ కారుల మాట. నాడు నై తెలంగాణ అని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు స్వరాష్ట్రంలో కేసీఆర్ పంచనా చేరారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అటుకులు బుక్కి…జైలు జీవితాన్ని, కుటుంబాన్ని సైతం వదిలేసి ఉద్యమమే ఊపిరిగా బతికిన ఉద్యమకారులు ఏ గుర్తింపుకు నోచుకోలేక చిన్నచూపుకు గురి అవుతున్నారు. ఎప్పుడో ఓసారి గొంతు పెగులుతుంది. అన్యాయాలను లెక్కించి చెప్పేందుకు గర్జన అనివార్యంగా పుట్టుకొస్తోంది.

ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపైనా కూడా టీఆర్ఎస్ లోని ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీని కట్టబెట్టి ఉద్యమకారులకు ఎలాంటి మెసేజ్ ను పంపదల్చుకున్నారని కేసీఆర్ వైఖరిని సన్నిహితుల వద్ద చెప్పుకొని బాధపడుతున్నారు. ఏదైనా అవకాశం వస్తుందని ఊహించిన ప్రతిసారి ఎవరో ఒకరు గద్దల్లా ఎగరేసుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ నాడు ఏమ్మనారో…ఇప్పుడు ఎం చేస్తున్నరోనని నాటి పరిస్థితులను మరోసారి పునశ్చరణ చేసుకుంటున్నారు. పైగా ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కిస్తుండటంపై రగిలిపోతున్నారు.

తెలంగాణ ఏర్పాటుకు ఏడాదికి ముందు… “2013, ఏప్రిల్​ 23.. టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్​రావు కేసీఆర్ ఓ రేంజ్ లో విమర్శించారు. అవినీతి ఆరోపణలు కూడా చేసి…కేసీఆర్ కు అవినీతి మరకలను అంటించే ప్రయత్నం చేశారు. బయ్యారం, ఓబుళాపురం గనులు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్​కు ముడుపులు ముట్టాయని ఆరోపించిన ఎర్రబెల్లి…ఆయనను తెలంగాణలో తిరగనియ్యమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మహానాడులో మాట్లాడుతూ… సచివాలయానికి రాని సిఎం అంటూ మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై స్పందిస్తూ…సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక అప్పటి టీడీపీ నేత తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కూడా కేసీఆర్​పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్​ను హైదరాబాద్​లో తిరగనీయమంటూ సవాల్​ చేశారు. వాళ్లే ఇప్పుడు కీలక శాఖలకు మంత్రులుగా ఉన్నారు. దీనిని యాదికి తెచ్చుకొని మరీ టీఆర్ఎస్ సీనియర్లు బాధపడుతున్నారట.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.