మంత్రి ఎర్రబెల్లి మరో వివాదంలో చిక్కుకున్నారు. అధికారిక సభకు ఆహ్వానించి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారని కమలాపూర్ ఎంపీపీ తడుక రాణి వేదిక మీదే నిరసన తెలిపింది. మహిళా ఎంపీపీని అయినందుకే తనను అవమానించారని వేదిక మీద నుంచే అక్కడున్న వారిని నిలదీసింది. ఇంత జరుగుతున్నా మంత్రి మాత్రం అధికార కార్యక్రమంలో భాగంగా తన పనిని చేసుకుంటూనే ఉన్నారు కాని..ఎంపీపీ దగ్గరకు వచ్చి సమస్య ఏంటి అని మాత్రం అడగకపోవడం అందర్నీ విస్మయానికి గురి చేసింది.
తాజాగా ఇవాళ వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ అధికారిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కమలా పూర్ ఎంపీపీ తడుక రాణికి కూడా ఆహ్వానం అందింది. కానీ ఆమెను వేదిక మీదకు ఆహ్వానించారే కాని మాట్లాడించలేదు. దీనిపై అక్కడున్న వారిని నిలదీసింది ఎంపీపీ. అయితే…ఆమెను పార్టీ మారాలని టీఆర్ఎస్ నేతలే ఒత్తిడి చేస్తున్నారట. వారి మాట వినకపోవడంతో ఆమెను టార్గెట్ చేస్తూ సొంత పార్టీ నేతలే సామజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టింగులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఆధారాలను కూడా బయట పెట్టింది ఎంపీపీ. సభ వేదిక మీద ఆమెకు మాట్లాడే అవకాశం ఇస్తే ఎక్కడ తమ బాగోతం బయట పడుతుందోనని ఎంపీపీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె మద్దతుదారులు అంటున్నారు. హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టింది తడుక రాణి.
ఇటీవల మంత్రి మహిళలపై నోరు పారేసుకోవడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా చోటుచేసుకున్న ఈ సంఘటన వెనక మంత్రి హస్తం ఉందని… మహిళా ఎంపీపీని అవమానించిన నేతలపై, వారి వెనక మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి మహిళా సంఘాలు.