ఉద్యమానికి ఊపిరి పోసిన వాడు. ఉద్యమం ఆరిపోతున్న ప్రతిసారి తన మాటతో ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన మార్గదర్శి. ఆటుపోట్లతో పడుతూ, లేస్తున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకేల్లెందుకు దైరక్షన్స్ ఇచ్చిన ఉద్యమ దర్శకుడు. ఆరు నూరైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని, ఎవరూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని పోరాడి తెలంగాణను సాధించుకుందామని చెప్పిన ఆధునిక జ్యోతిష్యుడు. ఆయనే జయశంకర్ సార్..తెలంగాణ ఉద్యమ నావకు చుక్కానిలా నిలిచి ఆరు దశాబ్దాల పోరాట ఫలానికి పునాదులు వేసిన మాస్టారూ. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా టీవీ6 స్పెషల్ స్టోరీ

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్…తెలంగాణ ఉద్యమ మర్గనిర్దేషకుడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ఆశగా, ఆశయంగా బతికిన ధీశాలి. ప్రత్యేక రాష్ట్ర కళను శ్వాసించి..అది సిద్దించిన క్షణాన మన మధ్యన లేని ఉద్యమ దిక్సూచి. తన జీవితమంతా ఒక్క తెలంగాణనే శ్వాసించిన ప్రత్యేక రాష్ట్ర ప్రేమికుడు. పుట్టుక ఆయనది…చావు ఆయనది…బతుకంతా తెలంగాణది.

జయశంకర్ సార్…తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉద్యమకారుడు. ప్రతిసారి మోసాలకు, కుట్రలకు వంచనకు తట్టుకోలేక చాతికిలపడిపోతున్న ఉద్యమాన్ని భుజాలపై మోసి ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన ఉద్యమ సేనాని. ఉద్యమ నేతలకు , ఉద్యమకారులకు ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల్ల అని అనిపించినప్పుడల్లా…తన మాటలతో బూస్టింగ్ ఇచ్చిన ఉద్యమాల ఉపాధ్యాయుడు. తొలి తరానికి ఊపిరి, మలితరానికి మార్గదర్శకుడై ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నినాదాన్ని ఎత్తుకున్నారు.
తెలంగాణ ఉద్యమే ఎజెండాగా సాగారు జయశంకర్. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను విడమర్చి, ఆధారాలతో సహా బయటపెట్టిన పెద్ద సార్ ఆయన. దోపిడీ అణచివేతలపై కలాన్ని ఆయుధంగా మలిచి ఎక్కుపెట్టిన ధీరోదాత్తుడు జయశంకర్. ఖండాంతరాలకు సైతం ప్రత్యేక కళను తీసుకెళ్ళిన ఉద్యమ రథసారధి ఆయన. తన బలం, బలహీనత తెలంగాణనే అని అన్నారంటే…ఆయన ప్రత్యేక కళను ఎంతగా స్వప్నించారో అర్థం చేసుకోవచ్చు. కాని ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్ళారా చూడకుండానే కన్నుమూశారు.

ఆగష్టు 6, 1934న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు జయశంకర్.బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న ఆయన…ఉద్యమాల నేల ఉస్మానియాలో పీహెచ్ డీ పూర్తి చేశారు. 1952లో జరిగిన నాన్ ముల్కీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. స్తానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని…లెక్కలతో సహా వివరించారు ఆయన. 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టారు. మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు అటెండ్ఐ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యతను వినిపించారు.
1960లో ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టి…1975 నుంచి 1979 వరకు వరంగల్ సీకేఎం ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 1979 నుంచి 1981 వరకు కేయూ రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన జయశంకర్ 1969 ఉద్యమంలో కీ రోల్ పోషించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిచ్చే అందరికీ ఆయన సలహాలు సూచనలు చేశారు. ఉద్యమ అనివార్యతను వివరించేవారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవొచ్చు కాని…ఖచ్చితంగా ఏర్పడి తీరుతుందని అందరిలోనూ ఆత్మ స్థైర్యాన్ని నింపేవారు జయశంకర్.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుకు వచ్చి…తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కు సిద్దాంత కర్తగా పని చేశారు. అవ్వాల్సిన చోట ఘనమై, ఇంకాల్సిన చోట ద్రవమై, వీచాల్సిన చోట వాయువై , రాగాలాల్సిన చోట నిప్పై కనికై ఉద్యమాన్నికి ఆయువు పట్టుగా నిలిచారు జయశంకర్ సార్. తెలంగాణ అనే ఇంటికి పెద్దన్నగా మారి…ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో చెప్తూ , తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులకు కంట్లో నలుసుగా మారారు.

తెలంగాణ రాజకీయ నినాదనమని ఆంధ్ర ప్రాంతం వారు విమర్శలు చేస్తే..అది రాజకీయ నినాదం కాదని…దానికి బలమైన ఆర్థిక కారణాలను వివరించి అందరి నోళ్లను మూయించారు. తెలంగాణకు విశిష్ట నేపథ్యం ఉందని , సాంస్కృతిక ఆచారం ఉందని చెప్పేవారు జయశంకర్. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయి తీరుతుందని…జనాల్లో నమ్మకాన్ని ప్రోది చేసేవారు ఆయన. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎన్ని ప్రశ్నలు వచ్చినా..తానోక్కడిని సమాధానం చెప్పగలనని ఎన్నో విష ప్రచారాలను జయశంకర్ తిప్పికొట్టి పాలకుల్లో తెలంగాణపై ప్రేమను కనబరిచేలా చేశారు సార్.
“అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్నా ఔర్ మర్జానా” ( ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి ) అని అనేవారు జయశంకర్. ఉస్మానియా విద్యార్థుల గురించి ‘ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది. అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తాయి. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తు కనిపిస్తారు… వారు గుర్తుకొస్తే దు:ఖమొస్తది అనేవారు. అయితే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదని అనేవారు జయశంకర్. ఉద్యమంలో ఉస్మానియా పాత్రను ఇలా చెప్పారు ప్రేమపూర్వకంగా ఆయన.

అనుకున్న ఆశయం నెరవేరినా ఆయన మన మధ్య లేకపోవడం..చుక్కల మధ్యలో చంద్రుడు లేడనే లోటును తెలియజేస్తోంది. ఆయన నిరాడంబర, ఉద్యమ నేపథ్యాన్ని తలిచి జయశంకర్ సార్ జయంతిని తెలంగాణ ప్రజానీకం ఊరువాడా, ఘనంగా జరుపుకుంటోంది. పెద్ద సార్ కు ఉద్యమ అభివందనాలు తెలియజేస్తోంది..