మంత్రి గంగుల కమలాకర్ కు ఈడీ నోటిసులు జారీ చేయడం సంచలనంగా మారింది. గ్రానైట్ తవ్వకాలు, తరలింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయని 360 కోట్ల పెనాల్టీ వేసింది ఈడీ. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. అసైన్డ్ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదు అందిన వెంటనే ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించిన కేసీఆర్…ఇప్పుడు గంగుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఈటలపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి…కాని గంగుల విషయంలో మాత్రం తప్పు జరిగిందని ఈడీ జరిమానా విధించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈటలపై ఇలా ఫిర్యాదు అందగానే ఆగమేఘాల మీద స్పందించి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్…ఇప్పుడు గంగులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని నిలదీస్తున్నారు. చర్యలు తీసుకొనే విషయంలో మంత్రికో రూల్ ఉంటుందా బంగారు తెలంగాణలో అని ఎద్దేవా చేస్తున్నారు.

అవినీతి చేస్తే కన్న బిడ్డలను కూడా వదలనని చెప్పిన కేసీఆర్…ఇప్పుడు గంగులను వెనకేసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి ఈటలను ప్లాన్ ప్రకారం, ఉద్దేశ్యపూర్వకంగానే బయటకు పంపించినట్లు విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.