దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేసి…టీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టించాలని కాంగ్రెస్ భావిస్తోంది.అందుకే ఈ దండోరా కార్యక్రమాన్ని టి. కాంగ్రెస్ చాలెంజింగ్ గా తీసుకుంది. ఇంద్రవెల్లిలో పూరించే పోరు శంఖం…రాష్ట్ర వ్యాప్తంగా రీసౌండ్ ఇవ్వాల్సిందేనని నేతలు ఫిక్సయ్యారు. దీంతో నేతలు ఎవరికీ వారు సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. లక్ష మందిని సభకు తరలించి కేసీఆర్ దళితులు, గిరిజనులకు చేస్తోన్న మోసాన్ని వివరించి…పార్టీ వైపు వారిని ఆకర్షితుల్ని చేయాలని కాంగ్రెస్ ఈ సభను ప్రెస్టేజియస్గా తీసుకుంటోంది.
దళితులకు, గిరిజనులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా…ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెర తీశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దళిత బంధు హుజురాబాద్ ఎన్నికల స్టంట్ అని ఆ పథకాన్ని నమ్మి దళితులు మోసపోవద్దని…కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను ఆగస్ట్ 9న నిర్వహిస్తోంది. మాజీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ నివాసంలో ఇంద్రవెల్లి సభ నిర్వహణపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావుతో పాటు పలువురు ముఖ్య నేతలతో కూడిన బృందం సమావేశమై సీరియస్‌గా చర్చించింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్ద సభ ఎప్పుడు జరగలేదనేలా…ఇంద్రవెల్లి దండోరా ఉంటుందని నేతల బృందం తెలిపింది.
18 ఎకరాల స్థలం తీసుకొని సభాస్థలి ఏర్పాటు చేయలని నిర్ణయించారు. ఇంద్రవెల్లి, సిరికొండ, ఉట్నూర్ నుంచి 20 వేలకు పైగా.. బోథ్ నియోజకర్గం నుంచి 18 వేలు, ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి 15 వేల మందికి పైగా, అసిఫాబాద్ నుంచి 15 వేలు, మంచిర్యాల నుంచి 9 వేలు, ఖానాపూర్ , కడెం ,జెన్నారం మూడు మండల నుంచి 6 వేలు , బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి 3 వేలకు పైగా, చెన్నూరు నియోజకవర్గం నుండి 3 వేలు, ముధోల్ నుంచి 3 వేలు సిరిపూర్ నియోజకవర్గం నుండి 1000 మంది ,నిర్మల్ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు,నాయకులు హాజరుకానున్నారు.
బాల్కొండ,ఆర్మూర్, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, రామగుండం , బోధన్, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జన సమీకరణపై పీసీసీ సీనియర్ నాయకులు నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు.మొత్తంగా ఇంద్రవెల్లి సభతో…కాంగ్రెస్ పునర్వైభవం దిశగా అడుగులు వేయడం పక్కా అని నేతలు ఆశపడుతున్నారు.