గ్రామ స్థాయి లీడర్లే కారును మెయింటేన్ చేస్తున్న కాలమిది. ఎక్కడికైనా వెళ్ళాలంటే అనుచరులను వెంటేసుకొని హడావిడి చేసే పరిస్థితులను కళ్ళారా చేస్తూనే ఉన్నాం. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా ఇప్పటికీ సాధారణ జీవితాన్నే ఇష్టపడుతారు ఆయన. ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి పాలకులు అనేవారు ప్రజలకు సేవకులే కాని, వారేమి ప్రత్యేక తరహ వ్యక్తులేమి కాదని తన నడవడిక ద్వారా నిరూపించారు ఆయన. ఆయనెవరో ఈపాటికీ మీకు అర్థమైయ్యే ఉంటుంది. ఆయనే సీపీఐ (ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య.

సాధారణంగా ఇప్పుడున్న నేతలంతా ఒక్కసారి ఎమ్మెల్యే అయినా జావితానికి సరిపడా దోచేస్తున్నారు. కాని ఆయన మాత్రం ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా కనీసం కారు కూడా కొనలేకపోయారు. సొంత ఆస్తులను కూడబెట్టుకోవాలని ఎ క్షణం అనుకోలేదు ఆయన. జీవితమంతా నమ్మిన సిద్ధాంతం కోసమే పని చేసిన మచ్చ లేని మనిషి గుమ్మడి నర్సయ్య. అవినీతి మారక లేదు. నిజాయితీకి నిలువట్టదంలా నిలిచిన వ్యక్తి. ఆదర్శవంతమైన ఆయన జీవితాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలని గుమ్మడి నర్సయ్య బయో పిక్ తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు పరమేశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

గుమ్మడి నర్సయ్య బయోపిక్ లోగోను ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మరుగున పడిపోతున్న ఆదర్శనీయమైన వ్యక్తుల చరిత్రలను ప్రస్తుత జనరేషన్ కు తెలియజేసేందుకు పరమేశ్వరన్ ముందుకు రావడం అభినందనీయమని సుకుమార్ ప్రశంసించారు. ఈ సినిమాలో నటించే నటీనటులు, సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
