ప్రజా దీవెన పేరిట పాదయాత్ర చేపట్టిన ఈటల రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన చేపట్టిన పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. 12 రోజులుగా పాదయాత్ర చేస్తున్న ఈటల తాజాగా అస్వస్థతకు గురవ్వడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. బీపీ 90/60, షుగర్ లెవెల్స్ 265 గా ఉన్నట్టుగా తేలింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోతు ఉండటంతో పాదయాత్ర వాయిదా వేసుకోవాలని వైద్యులు ఈటలకు సూచించారు. దీంతో పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్టు ఈటల ఓ ట్వీట్ చేశారు.
పన్నెండు రోజులుగా, 222 కిలోమీటర్లకు పైగా సాగిన ప్రజా దీవెన యాత్రలో ప్రతి క్షణం నా వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం.వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయి. కానీ ఊహించని అస్వస్థత వల్ల ప్రజా దీవెన యాత్రని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆరోగ్యం సహకరించగానే ప్రజా దీవెన యాత్ర మళ్ళీ పునః ప్రారంభం అవుతుంది. ఆగిన చోటు నుండే అడుగులు మొదలవుతాయి. కొండంత మీ దీవెనలతో త్వరలో ప్రజా దీవెన యాత్రతో వస్తాను.
