మరో మనిషి సహాయం లేకుండా కదల్లేని స్థితిలో ఉన్న ఓ ప్రొఫెసర్ గురించి రాజ్యం భయపడుతుంది. అతని చేతుల్లో ఆయుధాలేమి లేవు. అయినా…రాజ్యం అతన్ని నిర్భందించింది. ఓ నూతన సమాజాన్ని ఆవిష్కరించాలని తపించిన మేధావి కలలపై నిఘా ఉంచింది. పీడితులపై అణచివేత తప్పని మాట్లాడినందుకు అతని జైల్లో నిర్బంధించింది. సమానత్వం కావాలని నినదించినందుకు గొంతు నొక్కాలని చూస్తోంది. ఈ దేశంలో వ్యవస్థీకృతమైన అన్యాయనాన్ని, దోపిడీని ప్రశ్నించడం దేశ ద్రోహం అయినా చోట అతను న్యాయం కావాలని మాట్లాడినందుకు అతను దేశ ద్రోహి అయిండు…ఆయనెవరూ ఈపాటికీ అర్థం అయి ఉండొచ్చు…ఆయనే ఢిల్లీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా…ఆయన సహచరి వసంత జన్మదిన సందర్భంగా ఆయన రాసిన ఓ లేఖ అందర్నీ కదలిస్తోంది.

ప్రియమైన వసంతా…
పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ లేఖ నీ పుట్టిన రోజు నాటికీ అందుతుందని అనుకుంటున్నా. ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జర్పుకోవాలని ఆశిస్తూ…
నేను లేకుండా పుట్టిన రోజు జరుపుకుంటున్నందుకు నీవెంత వేదన అనుభావిస్తున్నావో నేను ఊహించగలను. ఎం చెద్దాం..రాజ్యం మనల్ని వేరు చేసేందుకు నిశ్చయించుకుంది. మన సహచర్యంలో మనమెప్పుడు మన వ్యక్తిగత వృద్ది కోసం ఆలోచించలేదు. మన ప్రతి ఆలోచన సమాజం కోసమే. ఈ సందర్భంగా నీకు ఒక్కటే చెప్పదల్చుకున్నా. నీవేమి భయపడకు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు. నేను ఎప్పటికీ నీ పక్కనే ఉంటా. నాపై కొనసాగుతున్న రాజ్య నిర్బంధం నిన్నేమి భయపెట్టదని నేను భావిస్తున్నాను. మన మీద రాజ్యం ప్రయోగిస్తోన్న ఈ నిర్బంధాన్ని మన గుండె నిబ్బరంతో ఎదుకోవాల్సింది. మనపై కొనసాగుతున్న ఈ దాడి భారత రాజ్యంగానికే తలవంపు లాంటిది. మనమేమి తప్పు చేయలేదు. స్వేఛ్చ కోసం పరితపిస్తున్నాం. సమానత్వం కావాలని ఆశిస్తున్నాం. గొంతుండి మాట్లాడలేని బాధితుల పక్షాన మాట్లాడుతున్నాం. విలువల కోసం అణగారిన వర్గాల ప్రజల కోసం ముందుకు సాగుతున్నాం. అయినా రాజ్యానికి మనం ఎందుకు ద్రోహులుగా కనిపిస్తున్నామో…

ఒక్క మాట వసంత…మన కళల మీద రాజ్యం దెబ్బకొట్టవచ్చు. కాని మనం కనే కలల్ని మాత్రం రాజ్యం ఆపలేదు కదా. చాలా జాగ్రత్తగా మన కలల్ని హృదయంలో భద్రపర్చుకుందాం. ఆ దిశలోనే ముందుకు సాగుద్దాం. ఆఖరి మజిలీ వరకు పీడితుల పక్షానా నిలబడద్దాం. నాపై మోపుతున్న కేసులను చూసి నీవేమి చింతించకు. నన్ను బందీగా ఉంచిన తీరుతో నీవేమి కలత చెందకు. నా జీవితంలో నీ జన్మదినం చాలా ముఖ్యమైన రోజు. నాకు సైతం తెలియని ఆనందం అది. నీ పుట్టిన రోజున నీవు ఆనందంగా ఉండాలే కాని…నన్ను నిర్బంధించిన విధానంతో ధైర్యం కోల్పోవద్దు వసంత. ధైర్యం కోల్పోవద్దు…
నీ ఈ పుట్టిన రోజున నేనేమి ఇవ్వగలను..?నా వద్ద మిగిలిన ప్రేమను తప్ప..?నీకు ఏమి ఇవ్వగలను..?మొదటిసారి మనం విద్యార్థులుగా కలిసినప్పుడు చిగురించిన ప్రేమను తప్ప నీకేమి ఇవ్వగలను..? అప్పుడు నాపై నువ్వు చూపించిన ప్రేమను ఇప్పటికీ కొనసాగిస్తున్నావ్…ఇప్పుడు నన్ను ఈ బందీఖానా నుంచి విముక్తి చేసేందుకు పోరాటం చేస్తున్నావ్. చుట్టూ చీకటి అల్లుకుపోయిందని నిరాశ పడకు. మన ఆశయ సాధనలో నిరాధ చెందదకూదదు. ఎందుకంటే ఈ చీకటిని తెంపెందుకు వెన్నెల రాక అనివార్యమే కనుక నిరాశను దరి చేరనివ్వద్దు.
నేను ఇప్పటి వరకు సాధించినవన్నీ…నువ్వు నా వెంట నిలబడటం వలెనే సాధ్యం అయిందని నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ ఇనుప చువ్వల వెనక నుంచి…ఈ పుట్టిన రోజున నీ ప్రేమను పునరాంకితం అవుతున్నాను.