టీఆర్ఎస్ ను ఎదురిస్తే ఎలా ఉంటుందో ఈటలను ఓడించి అసంతృప్త నేతలకు హెచ్చరిక పంపాలని చూస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈమేరకు ఈటల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. ఆయనను ఒంటరి చేసేందుకు పావులు కదుపుతున్న టీఆర్ఎస్…ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఈటల సన్నిహితులను టీఆర్ఎస్ లోకి లాగేసుకుంటున్న పింక్ పార్టీ…ఇప్పుడు ఈటలకు వస్తున్నా ఆదరణను కనుమరుగు చేయాలనే వ్యూహం రచిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈటలపై యుద్ధం స్టార్ట్ చేసింది ఆ పార్టీ. దళితుల ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్ కే పడేలా పక్కా ప్లాన్ తో ఉన్న టీఆర్ఎస్…ఈటలను విశ్వసిస్తున్న దళితులను కూడా తమ కోర్టులోకి లాక్కోవాలని చూస్తుంది.
దళితుల అభ్యున్నతికి సిఎం కేసీఆర్ దళిత బందును అమలు చేసేందుకు ప్రణాళిక బద్దంగా వెళ్తుంటే…కేసీఆర్ ను ఈటల వ్యతిరేకిస్తున్నారని టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంలో ఎదురుదాడి ప్రారంభించింది. దళితుల అభ్యున్నతి ఈటలకు ఇష్టం లేదని…ఆయన ఎదుగుదలే ఈటలకు ముఖ్యమని అందుకే దళిత బందును వ్యతిరేకిస్తున్నారని పేర్కొంటోంది సోషల్ మీడియా విభాగం. అయితే..ఇక్కడే ఓ విషయం చెప్పుకోవాలి.తన రాజీనామాతో ప్రభుత్వం దళిత బంధును అమలు చేస్తుందని, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసిందని, రేషన్ కార్డులను మంజూరు చేసిందని అందుకు సంతోషిస్తున్నానని స్పష్టం చేశారు ఈటల. కాని ఆయన దళిత బందును వ్యతిరేకిస్తున్నారని వ్యతిరేక ప్రచారం శురూ చేసింది అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం.

పైగా ఈటల బామ్మర్ధి చాట్ చేసినట్లుగా కొన్ని స్క్రీన్ షాట్స్ ను సర్కులేట్ చేస్తుంది. అందులో దళితలను ఆయన అవమానించేలా చాట్ చేశారని…చిన్న చిన్న దానికే దళితులంతా అటువైపు మొగ్గుచూపుతున్నారని తిట్టే పోస్ట్ ను హైలెట్ చేసింది. ఈటల గతంలో చెప్పిన మాటలు, ఇప్పుడు అంటున్న మాటలను పోలుస్తూ వీడియోలు చేస్తూ టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఈటల టార్గెట్ గా ప్రచారం మొదలెట్టింది. జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఈటల వర్గం ఖండించింది. కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని, ఈటలను నేరుగా డీకొట్టలేక ఇలా తప్పుడు ప్రచారంతో ఓడించాలని చూస్తున్నారని ఈటల వర్గం మండిపడుతోంది.