కోవిడ్ కష్టకలంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పథకాల అమలుని నిలిపివేయడం లేదు. ఇచ్చిన హామీ మేరకు పథకాలను వరుసగా అమలు చేస్తూ ప్రతిపక్షాలను సైతం జగన్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అప్పులతో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని చెబుతున్నా…ప్రజల ప్రయోజనం కోసం వేటిని లెక్క చేయమని పేర్కొంటున్నారు జగన్.
ఈ క్రమంలోనే ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను నేడు తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించిన జగన్…అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా మంజూరు అయ్యే నిధుల విడుదల ఆలస్యం చేయకుండా జగన్ సకాలంలో నిధులను విడుదల చేస్తున్నారు.,
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ఈ జగనన్న ఈ విద్యా పథకానికి ఇప్పటి వరకు రూ.26,677.82 కోట్లు వెచ్చించింది. తద్వారా 1,62,75,373 మందికి లబ్ధి కలిగింది. దీనికి తోడు నాడు–నేడు పథకం కింద ప్రీప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్న అంగన్వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా ఏటా మరో రూ.1,800 కోట్ల వ్యయం చేస్తోంది.