హుజురాబాద్ బైపోల్ ను త్వరలోనే నిర్వహించే అవకాశం ఉందా…?అక్కడ సాధ్యమైనంత తొందరలో ఎన్నికను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉందా..?అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పూర్తి వివరాలతో ఓ నివేదికను పంపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో శశాంక గోయల్ పూర్తి నివేదికతో కూడిన సమాచారం పంపారని ప్రచారం జరుగుతోంది.

గతంలో ఎన్నికలు నిర్వహించిన సమయంలో ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు…?ప్రస్తుతం ఓటర్లు ఎంతమంది ఉన్నారు..?సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా…?ఉంటె ఎన్ని ఉన్నాయి..?పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఎంత మేర అవసరం అవుతారనే విషయాలపై సమగ్ర నివేదిక రూపొందించి కేంద్ర ఎన్నికల సంఘానికి అందించినట్లు సమాచారం. హుజురాబాద్ సెగ్మెంట్ లో 2,42,420 మంది ఓటర్లు ఉన్నారని ఈ లెక్కన చూస్తె.. సుమారు 825 మంది పోలీసులు అవసరమని నివేదికలో పెర్కొన్నట్లు సమాచారం. 82సమస్యాత్మక ప్రాంతాల్లో 305 పోలింగ్ కేంద్రాలకు సగటున 610 బ్యాలట్, కంట్రోల్, వీవీప్యాట్ మిషన్లు అవసరమని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ లెక్కలతో ఓ నివేదికను ఎస్ఈసీ పంపినట్లుగా సమాచారం. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్య వైశ్యులు పోటీ చేస్తామని ప్రకటించడంతో అక్కడ భారీగా వీవీ ప్యాట్లు అవసరం పడే అవకాశం కనిపిస్తోంది.