
సినిమాలో విలాన్ అయినా నిజ జీవితంలో హీరోగా వెలుగొందుతున్నారు నటుడు సోనూసూద్. పేదవారికి అపన్నహస్తాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విలక్షణ నటుడు మరోసారి హైదరాబాదీల మనసు గెలుచుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 3 మీదుగా వెళ్తూ రోడ్డు పక్కన మొసంబీ జ్యూస్ బండి వద్ద ఆగారు. అక్కడ కొద్దిసేపు జ్యూస్ చేసి వినియోగదారులకు విక్రయించారు. చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించాలని కోరుతూ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేక సివిల్స్ పై ఆశ ఉన్నవారి కోసం ప్రత్యేక స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ను ఇప్పటికే సోనూ ఏర్పాటు చేశారు. ‘సంభవం’ అనే ఉచిత స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ కోసం అభర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు కూడా ఏర్పాటు చేశారు.