కరోనాతో అతలాకుతమైన చైనాను ఇప్పుడు వరదలు కుమ్మేస్తున్నాయి. గత వెయ్యేళ్ళలో ఎప్పుడు చూడని వానలు కురవడంతో ప్రావిన్స్‌లో భయంకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. సముద్రంలో భవంతులు ఉన్నట్లుగా అక్కడి దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారాయి.
చైనాను వరదలు కమ్మేశాయి. ప్రావిన్స్‌లో వరద భీభత్సానికి కొట్టుకుపోతున్న కార్లు, ఫ్లై ఓవర్లపైకి చేరి బిక్కుబిక్కుమంటున్న ప్రజలు, అండర్ గ్రౌండ్ టన్నెళ్ల నుంచి జనాలను కాపాడుతున్న సీన్లు, రైళ్లలోని ప్రయాణికుల భుజాల వరకు నీళ్లొచ్చిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ వరదల వల్ల ప్రావిన్స్‌లో ఇప్పటివరకు 25 మంది చనిపోయారు. సబ్ వే టన్నెల్ నుంచి ప్రయాణిస్తున్న రైలులోకి నీళ్లు వెళ్లడంతో 12 మంది మరణించారు. ఇద్దరు గోడ కూలి చనిపోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. వ్యాపారానికి, ఫ్యాక్టరీలకు పెట్టిందిపేరైనా సెంట్రల్ హెనన్ ప్రావిన్స్ లో 10 కోట్ల జనాభా నివసిస్తుంటారు. చైనాలోని అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ గత శనివారం నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ గత మూడ్రోజుల్లో 61 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. సిటీలో ఇంత భారీ స్థాయిలో వానలు కురవడం ఇదే తొలిసారని వెల్లడించారు. ప్రావిన్స్‌లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని రోజులు భారీ వానలు కురవచ్చని హెచ్చరించింది. అధికారులు సుమారు లక్షా 60 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వానలకు సెంట్రల్ హెనన్ ప్రావిన్స్‌లోని సబ్‌వేలు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రావిన్స్‌ను ఆనుకుని ఉన్న ఎల్లో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదలకు అనేక వెహికల్స్ కొట్టుకుపోయాయి. జెంగ్జౌలోని ఓ సబ్వే టన్నెల్ నుంచి వెళ్తున్న రైల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో అనేక మంది రైల్లో చిక్కుకుపోయారు. ప్రయాణికుల భుజాల వరకు నీరు ఉన్నట్టు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. రైల్లో కూడా ఇంతలా వరద నీరు చేరడం ఎన్నడూ చూడలేదని ప్రయాణికులు చెబుతున్నారు.