తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమరయ్య

తెలంగాణలో చీకటి ఆధిపత్యం చెలాయిస్తోన్న రోజులవి. కాలం గాయపడ్డసమయమది. వేలాది తల్లుల దుఖిత ఆవేదన భరిత సమయాలు.. మరెంతోమంది ఆడపిల్లల ఆర్తనాదాలు…అదో చీకటి యుగం. ఆ చీకటిని తెంపి వెలుగులను పూయించడం వెనక ఓ వీరుడి మరణం దాగి ఉంది. నడుస్తున్న కాలమ్మీద నిలబడి ఆధిపత్యాన్ని, అరాచకాలను సవాల్ చేయాలని ఎంతోమందికి మనస్సులో తిరుగుబాటు ఆలోచన రగిలినా..ముందడుగు వేస్తె కదంకదం కలిపడానికి సై అనేవాళ్ళు చాలామందే ఉన్నారు..ఆ ముందడుగు వేసింది మాత్రం దొడ్డి కొమరయ్యే. తెలంగాణకు తెగింపు వచ్చిందంటే కొమరయ్య స్పూర్తితోనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బానిసత్వం ముడ్డి మీద తన్ని ఆత్మగౌరవాన్ని తవ్వి తలపోసింది కొమరయ్యే. ఈవాల్టి తెలంగాణంపై ఆత్మగౌరవ పరిమళం వెనక నాటి తిరుగుబాటు వాసరత్వం ఉంది. ఆ తెగింపు నాడు ఉండక పోతే ప్రత్యేక, ప్రజాస్వామిక ఉద్యమాలకు తెలంగాణనేల పాదువేసి ఉండకపోయేది. ఇది ఎ ఒక్కరి మాటోకాదు …తెలంగాణ ఉద్యమ నీడలో ఇప్పటికీ ప్రజాస్వామిక హక్కులను స్వప్నించే గొంతుకల మాట. అలా కోట్లామంది స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర కళకు కూడా దొడ్డి కొమరయ్య ఉద్యమ ప్రాసంగికత ఉన్నది. ఆ ఉద్యమ నేపథ్యమే ఆంధ్ర పాలకులచెర నుంచి విముక్తి చేసి… తెలంగాణను ఆత్మగౌరవ పరిమళం నీడలో ఒదిగిపోయేలా చేసింది.

చరిత్రను చెరిపేసి..మయం చేయాలనీ చూసేవారు ఎంతోమంది ఉంటారు. కాని ఎవరు చేరిపెసినా చెదరనిది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర…ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పోరాడితే పోయేదేమీ లేదన్న తెగింపుతో భూమి, భుక్తి, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం రైతుకూలీ జనం తిరగబడిన అపూర్వ ఘట్టమది. ఆ చరిత్రను రక్తాక్షరాలతో లిఖించిన అద్భుత ఘట్టం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రపుటల్లోకి ఎక్కడమే కాడు..అణచివేతకు తిరుగుబాటే సమాధానమని పీడితులకు, బాధితులకు ఓ పాటాన్ని నేర్పిన పోరాటయోధుడు.

ఉమ్మడి వరంగల్ జిల్లా దేవర్పులు మండలం కడివెండి గ్రామంలో గొర్రె కాపర్ల కుటుంబంలో దొడ్డి కొమురయ్య జన్మించాడు. నిజాం పాలనలో నల్గొండ జిల్లాలో భాగంగా ఉన్న కడివెండిలో పేదలు, సామాన్యుల బతుకుల గురించి చెప్పేందుకు అక్షరాలకు కూడా ధైర్యం కావాలి. నాటి పరిస్థితులను చెప్పేందుకుగాను మాటలకు ధైర్యమనే సైలెన్ ఎక్కించాలి. అంతలా నాడు ఓ చీకటి యుగం నడిచింది. తినే తిండి మీద కూడా హకు లేని ఓ అనాగరిక యుగమది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట మీద కూడా ఎలాంటి అధికారం లేని దుర్మార్గమైన లోకం అది. చీకటి ముసురుకున్నప్పుడు వెలుగు రాక కూడా అనివార్యం అవుతుంది. అందుకే ఆ చీకటి రోజులపై వెలుగు రేఖలను విరజిమ్మెందుకు అన్నదమ్ములైన దొడ్డి మల్లయ్య, దొడ్డి కొమురయ్యలు ముందుకు కదిలారు. దొరల పాలనతో విసిగిపోయారు. కమ్యూనిస్టు లీడరైన దొడ్డి మల్లయ్య చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తిరుగుబాటు పాటాలను నేర్పారు. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు అంటూ…ఉద్యమ పాటాలను ఒంటబట్టించారు. మల్లయ్యకు అండగా నేనున్నానని కొమురయ్య నిలబడ్డాడు. తిరగబడితేనే కానీ ఈ బానిస బతుకులు మారవని ప్రజలకు వివరించారు. దొరల్ని తరిమి కొట్టాలంటే మరింత బలం కావాలని ఆలోచించిన మల్లయ్య ఆంధ్ర మహాసభ నాయకుల మద్దతు తీసుకున్నారు. దీనికి తోడు దేశ్‌‌ముఖ్ రాంచంద్రారెడ్డి, అతని తల్లి జానకమ్మల అకృత్యాలకు వ్యతిరేకంగా పలు సంఘాలు ఏర్పాటయ్యాయి.

అది కడివెండి గ్రామం.. 1946 జులై 4… దేశ్‌‌ముఖ్ తొత్తులకు, రజాకార్లకు వ్యతిరేకంగా గుత్పల సంఘం తిరుగుబాటుకు ఉపక్రమించింది. ప్రజల్లో చైతన్యాన్ని రాజేసిన మల్లయ్య, కొమురయ్య నాయకత్వంలో ఆ తిరుగుబాటు ముందుకు సాగింది. ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని ఆదిలోనే తుంచేయాలని మల్లయ్య, కొమురయ్యలను మట్టుబెడితే ఉద్యమం ఆపేయవచ్చునని జానకమ్మ దొరసాని ఆలోచించింది. దొరలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపుగా గడీ దగ్గరకు ర్యాలీ రాగానే రజాకార్లు, దొర బంట్లు గడీ లోపలి నుంచి జనంపైకి విచ్చల విడిగా కాల్పులు జరిపారు. అయినా జీవితం అంటే జీవించడం కాదని…జీవితాన్ని త్యాగం చేయడమని విశ్వసించిన దొడ్డి కొమరయ్య తుపాకి తూటాలకు బెదరలేదు. వెనకడుగు వేయలేదు. ముందుకే సాగాడు.

దొడ్డి కొమురయ్య పొట్టను చీల్చుకుంటూ తూటాలు పోవడంతో రక్తపు మడుగులో అతను నేలకొరిగాడు. కొమురయ్య రక్తంతో అక్కడి నేలంతా తడిచింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రపుటల్లోకి ఎక్కాడు. అప్పటి వరకూ శాంతియుతంగా సాగిన తెలంగాణ విముక్తి పోరు కాస్తా కొమురయ్య అమరత్వంతో రక్తానికి రక్తం.. ప్రాణానికి ప్రాణం.. అనే నినాదంతో సాయుధ పోరాటంగా మారింది. కొమురయ్య మరణంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం పోటెత్తడంతో దొరల గడీ నేలమట్టమైంది. కొమురయ్య త్యాగంతో మొదలైన పోరాటం హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. నాటి పోరాట ఫలితంగా ఎందరో నేతలు రైతులతో భుజంభుజం కలిపి తుపాకులు పట్టారు. దున్నే వాడిదే భూమి నినాదం మార్మోగింది. లక్షల ఎకరాల భూమి లేని పేదలకు పంచబడ్డాయి. కొమురయ్య అమరత్వం తెలంగాణ ఉద్యమానికీ స్ఫూర్తిగా నిలిచింది. అలాంటి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ట్యాంక్ బండ్ పైనా కొమురయ్య విగ్రహం పెట్టడంతో పాటు జనగామ జిల్లాకు కొమురయ్య పేరు పెట్టాలి. దొడ్డి కొమురయ్యను కన్న వీర భూమి కడవెండిలో జరిగే విగ్రహ భూమి పూజలో మనం భాగస్వాములం అవుదాం..ఆ పోరాట యోధుడిని స్మరించుకుందాం…

Load More Related Articles
Load More By admin
Load More In స్పెషల్ స్టోరీస్

Leave a Reply

Your email address will not be published.