AP Students Demands to Cancel Board Exams| ఓ రాజా.. మా భాధలు పట్టవా ?|Tv6 Telugu

ఏపీలో పరీక్షల నిర్వహణలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసేది లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పగా…పరీక్షలు రాసే ప్రసక్తే లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పరీక్షలు నిర్వహిస్తారా..?లేక రద్దు చేస్తారా..?అన్న విషయంలో పీటముడి నెలకొంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో సెకండ్ వేవ్ ప్రభావం కంటిన్యూ అవుతోంది. కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నా..పరీక్షలు పరీక్షలు అంటూ విద్యార్థులను మానసికంగా కుంగదీస్తోంది సర్కార్. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహిస్తామని సర్కార్ ప్రకటించడంపై విద్యార్థులు గత సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ భవిష్యత్ పేరుతో పరీక్షలను నిర్వహించి విద్యార్థులను కోవిడ్ వాహకులుగా మార్చకండి అంటూ పేరెంట్స్ సూచిస్తున్నారు. పరీక్షలు నిర్వహించాలని భావించడం సరైనదే కాని, రెండో అల చాప చుట్టకముందే పరీక్షలను నిర్వహిస్తే కరోనా వ్యాప్తికి మరింత ఊతం ఇచ్చినట్టు కాదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది విద్యార్ధి లోకం.

మరోవైపు…జాతీయస్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఏపీ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను విద్యార్థులు ప్రస్తుతం జేఈఈ, నీట్‌పై తమ దృష్టినంతా పూర్తిగా లగ్నంచేసి ప్రిపేర్‌ అవుతున్నారు. ఏపీలో మాత్రం పరీక్షలపై ఇంకా స్పష్టతే రాలేదు. దీంతో ఇంటర్‌ విద్యార్థులు ఇటు తమ క్లాసు పుస్తకాలు చదవాలో లేక అటు జాతీయస్థాయి పరీక్షలకు సిద్ధమవ్వాలో తెలియని సందిగ్ధంలో ఉండిపోవాల్సిన సిట్యూయేషన్ ఏర్పడింది. ఫలితంగా జాతీయస్థాయి పోటీలో ఏపీ స్టూడెంట్స్ వెనుకబడిపోతారని విద్యానిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మరోవైపు…రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయగా .. ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు అప్పుడే 2021-22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా ప్రారంభించాయి. ఆన్‌లైన్‌లో తరగతులను కూడా స్టార్ట్ చేశాయి. ఈ పరిస్థితి కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవికదృష్టితో ఆలోచించి.. మంచి నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యానిపుణులు కోరుతున్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించకుంటే ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్లకు ఇబ్బంది అవుతుందనేది ప్రభుత్వం వాదన. కానీ గత ఏడాది కూడా కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసినప్పుడు ఈ సమస్య ఉత్పన్నం కాలేదు. ఏటా నిర్వహించినట్టే ఆర్‌జీయూకేటీ ఎంట్రెన్స్‌ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టింది. అలాగే, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుండా ఎంసెట్‌ అడ్మిషన్లు నిర్వహించలేమన్న వాదనలోనూ అర్థం లేదని విద్యానిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంటర్‌ మార్కులకు వెయిటేజి రద్దుచేసి ఎంసెట్‌ ర్యాంకింగ్‌ ఆధారంగా అడ్మిషన్లు చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఈసారికి ఇదే పద్ధతిని అనుసరించాలని నిర్ణయించింది. పోనీ ఈ పరీక్షల వల్లనే ఉద్యోగులు వస్తాయా అంటే అదీలేదు. అందులో సింహభాగం ఉద్యోగాలకు ప్రత్యేకంగా నిర్వహించుకునే పోటీపరీక్షలలో సాధించే మార్కులే కొలమానంగా తీసుకుంటారు. అయినా ప్రభుత్వం మాత్రం ఉన్నత చదువులు, ఉద్యోగాలకు టెన్త్‌ ప్రామాణికమని పేర్కొనడంపై విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఇంటర్ విద్యార్థులను సమాయత్తం చేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Load More By BN chary
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *