లాక్ డౌన్ సందర్భంగా హైదరాబాద్ లో ఎవరూ ఆకలితో బాధపడవద్దని భావించి tv6 చేస్తోన్న ఆకలిపై యుద్ధం కార్యక్రమంలో యువత కూడా భాగస్వామ్యం అవుతోంది. tv6 యాజమాన్యంతో కలిసి ఓ బృందంగా ఏర్పడి ఆహార పంపిణీ కార్యక్రమంలో మేము సైతం అంటున్నారు. ఈవాళ సాయంత్రం కోటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నుంచి సుల్తాన్ బజార్ మీదుగా మొదలుకొని కోటి బస్టాండ్ వరకు వందలాది మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కోటి మెటర్నిటీ ఆసుపత్రి వద్ద జనం ఆహార ప్యాకెట్ల కోసం దవాఖానా లోపలి నుంచి వచ్చి మరీ తీసుకొని వెళ్ళిపోయారు. రెండు రోజులుగా సరైన తిండి కూడా లేదని..tv6బృందం చేస్తోన్న ఈ ఆహార పంపిణీ ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందించి తమ కడుపు నింపిందని అక్కడున్నవారు భావొద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్ లో కాయకష్టం చేసుకొని కడుపు నింపుకొనే తమకు లాక్ డౌన్ తో ఉపాధి లేకుండా పోయిందని..మూడు పూటల భోజనం కూడా గగనంగా మారిందని..కాని మీలాంటి వారి వలెనే తమ లాంటి ఎంతోమంది కడుపు నిండుతుందని చెప్పారు. కాలం అసమానతలతో బాధపడినప్పుడు…ఆ అసమానతలను తొలగించేందుకు ఓ విప్లవం పుట్టుకొస్తుందన్నట్లుగా..ఇప్పుడు మా లాంటి ఎంతోమంది ఆకలికేకలను నివారించేందుకు tv6 ఆవిర్భవించినట్లుగా ఉందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఆసుపత్రి వద్దనున్నవారు.
ఇక, ఈ దారిలోనే విధుల్లో ఉన్న పోలీసులకు కూడా ఆహార ప్యాకెట్లను అందించించి tv6 బృందం. అలాగే..రోడ్డుపై ఉన్న నిరాశ్రయులు, యాచకులకు ఆహార ప్యాకెట్లను అందజేసి ఆకలితో వారి వెన్నుకంటిన పేగులకు కాసింత స్వాంతన చేకూర్చారు. వారికీ ఆహార ప్యాకెట్లను అందజేసే క్రమంలో వారంతా రెండు చేతులను జోడించి tv6 బృందానికి నమస్కరించారు. వారంరోజులుగా ఆకలితో అలామటిస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని…మానవత్వం చచ్చిపోయిందా అని అనుకుంటుడంగానే మీరు దేవుళ్ళుగా వచ్చారంటూ కళ్ళలో తిరిగిన నీటి సుడులను తుడిచేసుకున్నారు. tv6రోజూ చేస్తోన్న ఈ సహాయక కార్యక్రమాలపై పోలీసులు ఛానెల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో tv6 బృందం అరవింద్, అరుణ్, సాయి, చింటు, పవన్ కుమార్, సుభాష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.