మున్సిపల్ పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేయాలి: మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో కోవిడ్ వ్యాధి మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారీ చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమీషనర్ ఎండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీ.హెచ్.ఎం.సీ కమీషనర్ లోకేశ్ కుమార్ లతో మంత్రి ఇవ్వాళ ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా అన్ని పురపాలికల్లో వెంటనే సానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, క్రిమిసంహారక ద్రావకాన్ని పిచికారీ చేయాలని మంత్రి ఆదేశించారు.

ప్రస్తుతం మున్సిపల్ శాఖ వద్ద ఉన్న వాహనాలతో పాటు అవసరమైన చోట ప్రత్యేకంగా వాహనాలను అద్దెకు తీసుకుని సోడియం హైపోక్లోరేట్ ద్రావకం పిచికారీ చేయాలని మంత్రి చెప్పారు. పై పనుల కోసం పట్టణ ప్రగతి నిధులు వినియోగించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఈ క్రిమిసంహారకాల స్ప్రే జరగాలని మంత్రి అన్నారు.

కరోనా తీవ్రత ఉన్నందున శాఖ పరిధిలో ఉన్న ఎంటమాలజిస్టులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, శాఖలో ఉన్న అందరు ఉద్యోగులు విధిగా విధులకు హాజరు కావాలని, సెలవులు రద్దు చేయాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. ఆరోగ్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కూడా మంత్రి కేటీఆర్ కోరారు.

దీనితో పాటు కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలని, ప్రజలందరూ ఎల్లవేళలా మాస్కు ధరించేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు.

ఫ్రంట్‌లైన్ సిబ్బందికి 100 శాతం వాక్సినేషన్:

మున్సిపల్ శాఖ సిబ్బంది కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్నందున శాఖ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు. జీ.హెచ్.ఎం.సిలో రేపటికల్లా వందశాతం ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి అవుతుంది అని, మిగతా పురపాలికల్లో కూడా ఇంకో 2-3 రోజుల్లో ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తామని అధికారులు మంత్రికి తెలియజేశారు.

Load More Related Articles
Load More By admin
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *