తిరుపతి, నాగార్జున సాగర్ ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. తిరుపతిలో ఈ సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఎన్నికల ప్రక్రియ జరిగింది. క్యూ లైన్లలో ఉన్న వారిని పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతించారు. సాయంత్రం 6 నుంచి 7 వరకు కోవిడ్ బాధితులకు ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 వరకూ 55 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
ఇక నాగార్జున సాగర్లోనూ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 84.32 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్ పోటీ చేశారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాగా తిరుపతి పార్లమెంట్ పరిధి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లలో ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో 2,470 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేశారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తితో పాటు టీడీపీ తరపున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్, సీపీఎం తరఫున నెల్లూరు యాదగిరి సహా మొత్తం 28 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు.