వైఎస్ షర్మిల అనుచరులకు కరోనా… ఐసోలేషన్‌లో కొండా రాఘవరెడ్డి

ఖమ్మంలో ఈ నెల 9న వైఎస్ షర్మిల నిర్వహించిన సంకల్ప సభకు హాజరైనవారిలో… కొంతమంది ఆమె అనుచరులు కరోనా బారినపడ్డారు. ఇందులో షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి కూడా ఉన్నారు. కరోనా బారినపడ్డ షర్మిల అనుచరుల్లో కొందరు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. షర్మిల అనుచరులకు కరోనా సోకిందని తెలియడంతో ఖమ్మం సభలో వారిని కలిసినవారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 9న ఖమ్మం సభ జరగ్గా… అంతకు వారం రోజుల ముందే కొండా రాఘవ రెడ్డి అక్కడికి వెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. సభ ముగిసిన మరుసటి రోజు ఆయనకు జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా టెస్టుల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుతం షర్మిల దీక్షా శిబిరంలో కొండా రాఘవరెడ్డితో పాటు మరికొందరు అనుచరులు కనిపించట్లేదు.

మరోవైపు ప్రస్తుతం వైఎస్ షర్మిల రెండో రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని తన నివాసం లోటస్‌పాండ్ వేదికగా ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలన్న డిమాండుతో ఇందిరా పార్క్ వద్ద ఆమె నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. నిజానికి నిన్న సాయంత్రం 5గంటల వరకు మాత్రమే పోలీసులు దీక్షకు అనుమతినిచ్చారు. అయితే అనూహ్యంగా తన దీక్షను 72 గంటలకు పొడగిస్తున్నట్లు షర్మిల సంచలన ప్రకటన చేశారు.

ఇందిరా పార్క్ సమీపంలోని దీక్షాస్థలి నుంచి లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి పాదయాత్రగా బయలుదేరారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు ఆమెను,అనుచరులను అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో షర్మిల సొమ్మసిల్లిపోగా.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అనంతరం లోటస్‌పాండ్‌లోని నివాసానికి తరలించారు.

అప్పటినుంచి షర్మిల లోటస్‌పాండ్‌లో దీక్షను కొనసాగిస్తున్నారు. అంతకుముందే ఆమె దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు. తనను ఎక్కడికి తరలించినా సరే దీక్ష విరమించేది లేదని చెప్పారు. చెప్పినట్లుగానే ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్యంపై అనుచరులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నిరాహార దీక్ష తర్వాత ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతామని షర్మిల ప్రకటించారు. నిన్నటి దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆమె ఘాటైన విమర్శలు చేశారు. చందమామ లాంటి పిల్లలు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే… సీఎం కేసీఆర్ తీరు మాత్రం దున్నపోతు మీద వాన పడినట్లే ఉందన్నారు. అంతేకాదు,తెలంగాణ సమయంలో కేసీఆర్ మొసలి కన్నీళ్లతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

Load More Related Articles
Load More By admin
Load More In క్రైమ్

Leave a Reply

Your email address will not be published.