చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని నార్వే పోలీసులు స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఏకంగా దేశ ప్రధానికే జరిమానా విధించారు. కరోనా వైరస్ విజృంభిస్తుండంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. బహిరంగ సభలు, పార్టీలపై నిషేధం విధించింది. ఏదైనా కార్యక్రమానికి 10 కంటే ఎక్కువ మంది ప్రజలు హాజరు కావొద్దని ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ నిబంధనలు సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని ఎర్నా సోల్బర్గ్ అతిక్రమించారు. 60వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. 13 మంది కుటుంబ సభ్యులతో కలసి ఫిబ్రవరిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. దీంతో అమె వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఆమె.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా.. ఈ వ్యవహారంపై దృష్టిసారించిన పోలీసులు.. దర్యాప్తు చేసి, ఆమెకు దాదాపు రూ.1.75లక్షల ఫైన్ విధించారు.