కేంద్ర హోంశాఖ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయింది. ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 24 మంది జవాన్లు వీర మరణం పొందడాన్ని కేంద్ర హోంశాఖ జీర్ణించుకోలేకపోతోంది.ఎలాగైనా దీటైన జవాబిచ్చి తీరాలని నిర్ణయించుకుంది. మావోయిస్టు బెటాలియన్ కమాండర్ హిడ్మాను వాడుకొని భద్రతా బలగాలను మావోయిస్టులు ట్రాప్ చేశారు. ఇప్పడు భద్రతా బలగాలు అదే హిడ్మాను టార్గెట్ చేస్తూ ఓ కొత్త ఆపరేషన్‌కు సన్నద్ధమయ్యాయి. హిడ్మాతో పాటు మరో 8 మంది మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. దీనికి ఆపరేషన్ ప్రహార్-3 అన్న పేరును పెట్టారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఇంటెలిజెన్స్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్‌ను ముమ్మరం చేయండి. మానవ మేధస్సుతో పాటు సాంకేతికతను కూడా బాగా వాడండి. మిగతా భద్రతా సంస్థలు కూడా సహాయం చేస్తాయని అమిత్‌షా అన్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర భద్రతా బలగాలు ‘మోస్ట్‌వాంటెడ్’ జాబితాను రూపొందించింది. అందులో మావోయిస్ట్ టాప్ కమాండర్‌తో పాటు మరో ఎనిమిది మంది జాబితాను రూపొందించారు. అంతేకాకుండా యువకులు నక్సలైట్ల వైపు మళ్లేలా బ్రెయిన్ వాష్ చేస్తున్న వ్యక్తులను కూడా గుర్తించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.