దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అలాగే కోవిడ్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ బారినపడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఆయన పలు సూచనలు చేశారు. ప్రత్యేకించి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనలు నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
పక్క రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాల నుంచి గ్రామాల్లోకి వచ్చే వారిపై దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేకించి నాలుగు సూత్రాలను పాటిస్తే కరోనా బారిన పడకుండా ఉండవచ్చన్నారు. వీటిలో ప్రధానంగా 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అన్ని వేళలా మాస్క్ ధరించాలని చెప్పారు. అలాగే చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు భౌతిక దూరం పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఇబ్బంది ఉంటే వెంటనే ఆస్పత్రిలో చేరాలని, నిర్లక్ష్యం చేసిన వారికి ప్రాణాప్రాయం ఉందన్నారు. తెలంగాణలో కరోనా కట్టడికి, మరణాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.