తెలంగాణ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో వైసీపీ పార్టీ ప్రజాదారణ కోల్పోయిందని, 14 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డితో కలిసి పనిచేశానని ఆయన గుర్తు చేశారు. త్వరలో జాతీయ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 2023 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
నల్గొండ జిల్లాను సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారని తెలిపారు. ఓ గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. యాదాద్రికి నిధులివ్వడం తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదని, ఎలాంటి అభివృద్ధిపనులూ చేపట్టలేదని ధ్వజమెత్తారు.