సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. నచ్చిందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తారు. నచ్చకపోయినా అంతే. ఇప్పుడాయన దృష్టి నాగార్జునసాగర్ ఉపఎన్నికపై పడింది.
వివాదాస్పద సినిమాలు తీయడం లేదా సినిమాలో ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని జోడించి చర్చనీయాంశం కావడం ఆర్జీవీ కు బాగా అలవాటు. అప్పుడప్పుడూ రాజకీయ, సామాజిక అంశాలపై నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నిక పై ఆయన దృష్టి పడింది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధిపై రామ్‌గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకు ఓటు హక్కుంటే సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కే ఓటేస్తానని ఆర్జీవీ తెలిపారు. ఈ మేరకు చిరుతపులితో నోముల భగత్ కలిసి నడుస్తున్న వీడియోను వర్మ ట్విట్టర్లో షేర్ చేశారు.
మరవైపు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లను సింహంతో పోల్చారు. చిరుతపులిని వాకింగ్‌కు తీసుకెళ్తున్న నోముల భగత్ అంటే తాను ఇష్టపడుతున్నట్టు ఆర్జీవీ తెలిపారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న డి కంపెనీ వెబ్‌సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.