న్యాయం కోసం ఎంతకాలం నిరీక్షించాలి?: వివేకా కూతురు సునీత

 తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడే క్రమంలో అలిసిపోతున్నామని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ హత్య అనంతరం తమ జీవితాల్లో ప్రశాంతత అనేది లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. అందుకు ప్రజల మద్దతు తీసుకుందామనే తాను ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని, ఈ హత్యకేసులో తమకు తెలిసిన విషయాలను ఎవరైనా వెల్లడించకపోతారా అని భావిస్తున్నామని పేర్కొన్నారు.  

హత్య జరిగి రెండేళ్లు దాటినా ఇంతవరకు హంతకులను పట్టుకోలేదు. హత్యపై ఓ ఉన్నతాధికారిని అడిగితే కడప, కర్నూలులో ఇలాంటివి సహజం అని బదులిచ్చారు. ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడి హత్యను మామూలుగా తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. మాకే న్యాయం జరగకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? న్యాయం కోసం ఇంకెంతకాలం వెయిట్‌ చేయాలి. జస్టిస్‌ డిలేడ్‌ ఇజ్‌ జస్టిస్‌ డినాయిడ్. ఈ అన్యాయంపై పోరాటంలో నాకు అందరి సహకారం కావాలి. హత్య వెనుక ఎవరున్నారో విచారణ అధికారులు నిగ్గుతేల్చాలి. నాన్న హత్య మా అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ కేసులో ఒక్కరినీ అరెస్ట్‌ చేయకపోవడం విచారణపై సందేహం కలుగుతోంది. నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు

ఓ మీడియాతో మాట్లాడుతూ… తండ్రి వివేకా హత్యకేసులో 15 మంది అనుమానితుల జాబితాను దర్యాప్తు అధికారులకు అందజేసినట్టు వెల్లడించారు. ఆ అనుమానితుల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ఉన్నాడని తెలిపారు. భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిల పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ జాబితాలో మొదటిపేరు వాచ్ మన్ రంగన్న అని, అతని వ్యవహార శైలి ఎంతో అనుమానాస్పదంగా ఉందన్నారు.

ఆ తర్వాత పేరు ఎర్ర గంగిరెడ్డి అని, ఆయన తన తండ్రికి ఎంతో సన్నిహితుడని, హత్య జరిగిన తర్వాత ఘటన స్థలంలో మరకలు శుభ్రం చేయించింది ఆయనే అని ఆరోపించారు. పరమేశ్వర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు సంబంధించి అనేక సందేహాలున్నాయని అన్నారు. ఇక తమ కుటుంబంలో తమకు కొందరు మద్దతుగా నిలుస్తున్నారని వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశానని తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఈ కేసుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సునీతారెడ్డి కోరారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *