ఐపీఎల్ 2021 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌లు చెన్నైలో ల్యాండయ్యారు. వీరితోపాటు ఆ జట్టు సహాయ కోచ్ బ్రాడ్ హడిన్ కూడా చెన్నైకు వచ్చాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ యాజమాన్యం తమ ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. “ఈగిల్స్ ల్యాండ్ అయ్యాయి.. కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, బ్రాడ్ హడిన్‌లకు స్వాగతం” అంటూ సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న 14వ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ జట్టు తమ తొలి ఐదు మ్యాచ్‌లను చెన్నైలోనే ఆడనుంది. ఈ నెల 11న తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఐదు మ్యాచ్‌ల అనంతరం హైదరాబాద్ జట్టు.. ఢిల్లీలో నాలుగు మ్యాచ్‌లు, ఆతరువాత కోల్‌కతాలో మూడు, బెంగళూరులో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.