తెలుగురాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో ఉన్న పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్ తో పాటు ఏపీలోని శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, కడప జిల్లాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది.
సోదాల్లో 40 సెల్ ఫోన్లు, 44 సిమ్ కార్డులు, 70 హార్డ్ డిస్క్ లు, మైక్రో ఎస్డీ కార్డులు, 19 పెన్ డ్రైవ్ లు, ఆడియో రికార్డర్స్, ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు, ప్రెస్ నోట్లతో పాటు 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు వివరించారు.
తెలంగాణలోని పలువురు పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడంతో పాటు వారిని ప్రశ్నించింది. తెలంగాణకు చెందిన న్యాయవాది రఘునాథ్, డప్పు రమేశ్, జాన్, మహిళా సంఘం కార్యకర్త శిల్ప ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఈ నలుగురికి నోటీసులు ఇచ్చారు. అయితే, ఎన్ఐఏ సోదాలను ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేస్తున్నారని పలువురు నేతలు విమర్శించారు.