ప్రభుత్వ మార్పుకు సాగర్ లోనే నాంది – కాంగ్రెస్ నేతలు

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత జానారెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ వస్తే తాను చేసిన అభివృద్ధిని చూపిస్తానని చెప్పారు. నల్గొండ జిల్లా హాలియాలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభలో జానారెడ్డి ఆవేశంగా ప్రసంగించారు. ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే ఆయన అందుకు భిన్నంగా మాట్లాడారు. తాను సాగర్‌కు ఏం చేశానో అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కు లేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు నీళ్లు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని, కేసీఆర్‌ వస్తే తీసుకెళ్లి చూపిస్తానని చెప్పారు. నల్గొండ జిల్లాకు సాగర్‌ ద్వారా నీళ్లు ఇచ్చింది తామేనని ఈ సందర్భంగా జానారెడ్డి గుర్తుచేశారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. సర్పంచ్‌గా గెలవలేని వాళ్లు ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారని ఎద్దేవాచేశారు. జానారెడ్డి అంటే పోరాటయోధుడని స్పష్టం చేశారు. తండాలకు వెలుగులు తెచ్చింది తానేని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో 2 లక్షల ఎకరాలు పేదలకు పంచామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ కనీసం 10 వేల ఎకరాలు పంచలేదని జానారెడ్డి ఆరోపించారు.

తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్..ఫాంహౌస్ వెళ్లి ఫోన్ స్విచ్చాఫ్ చేశారని గుర్తుచేశారు. జానారెడ్డికి సీఎం అయ్యే అవకాశం వచ్చినా..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని పోరాడారు అన్నారు.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో 50 వేల మెజార్టీతో గెలవబోతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిరుగుతుందని చెప్పారు. సాగర్‌లో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఎద్దేవాచేశారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. డబ్బు సంచులతో ప్రలోభాలకు గురిచేస్తారని, అయినా నమ్మొద్దని ప్రజలకు ఆయన సూచించారు. సీఎం కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడే మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

ఇక సాగర్‌లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధే జానారెడ్డిని గెలిపిస్తుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తెలంగాణ ఏర్పాటులో జానారెడ్డి పాత్ర కీలకమని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. అన్యాయంగా తమ ఎమ్మెల్యేలను అధికార పార్టీ చేర్చుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలవాలంటే.. జానారెడ్డిని గెలిపించాలని భట్టి విక్రమార్క కోరారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *