ఏపీలో కరోనా స్వైర విహారం.. ఆంధ్రా యూనివర్శిటీలో కరోనా కలకలం…కొత్తగా 947 పాజిటివ్ కేసులు..

ఏపీలో కరోనా పంజా విసురుతోంది. తాజాగా విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో కరోనా కలకలం రేగింది. యూనివర్శిటీకి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో 65 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్ లో మొత్తం 15 వందల మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు వచ్చిన పరీక్షల్లో 65 మందికి వైరస్ సోకింది. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ కు వైద్యాధికారులు తరలించారు.

విద్యార్థులకు కరోనా సోకడంతో ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ లో హాస్టళ్లను మూసివేశారు. యూనివర్శిటీ పరిధిలోని పలు కాలేజీలు తమ విద్యార్థులకు ఆన్ లైన్ లో పాఠాలు బోధించాలని నిర్ణయించాయి. ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ బోధనకు మారాలని వర్సిటీ రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏయూలో కరోనాపై మంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించారు. జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సూర్యనారాయణను అడిగి ఏయూలో కరోనా వ్యాప్తి వివరాలు తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సృష్టం చేశారు. విశాఖ జిల్లాలో నిత్యం 7 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాడేరు, అరకు, కేజీహెచ్, అనకాపల్లి, నర్సీపట్నం, విమ్స్ ఆస్పత్రుల్లో కొవిడ్ వార్డులు ఏర్పాటు చేశామని, 1000 బెడ్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

మరోవైపు ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ( శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు) 42,696 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 947 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 897810కు చేరింది. అదృష్టవశాత్తూ కోవిడ్ వల్ల శుక్రవారం ఒక్క మరణం కూడా సంభవించలేదు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మరణాల సంఖ్య 7203గా ఉంది. కొత్తగా 337 మంది వ్యాధి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 885892గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4715 యాక్టివ్ కేసులున్నాయి.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.