ఏపీలో కరోనా మహమ్మారి భయపెడుతోంది. ఊహించని స్థాయిలో మళ్లీ పాటిజిట్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖలో పరిస్థితి ఆందోళన పెంచుతోంది. ప్రజలు మాత్రం సెకెండ్ వేవ్ మొదలైందని ఆందోళనకు గురవుతున్నారు. దీంతా ఆయా జిల్లాల అధికారులు సైతం అలర్ట్ అవుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కలెక్టర్ జె.నివాస్ కోరారు. రెండో దశ కోవిడ్ వైరస్ వ్యాప్తి సూచనలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 7వ తేదీ వరకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను జిల్లాలోచేపడుతున్నట్టు చెప్పారు. గత డిసెంబరు నుంచి జనవరి వరకు జిల్లాలో కోవిడ్ పై అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో వివిధ కారణాల రీత్యా కేసులు పెరుగుతున్నాయని వివరిస్తూ ఏప్రిల్ 7వ తేదీ వరకు చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
ఈ నెల 25వ తేదీ నుండి గ్రామ సచివాలయాల పరిధిలో కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. వ్యాక్సినేషన్ చేసుకున్నప్పటికీ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. తాను కూడా వ్యాక్సినేషన్ వేసుకున్నానని, అయినప్పటికీ నిబంధనలను పాటిస్తున్నానని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 40 రోజులకు శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయని అంత వరకూ క్రమశిక్షణగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.