నష్టాల్లో మెట్రో-ఆదుకుంటామని కేసీఆర్ అభయం

కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో మెట్రోను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్ అండ్ టి కంపెనీ ఉన్నతాధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో, కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకరిస్తుందని ఎల్ అండ్ టి ఉన్నతాధికారులకు సీఎం హామీ ఇచ్చారు. తమను ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆధుకోవాలని కోరుతూ ప్రగతి భవన్ లో ఎల్ అండ్ టి ఉన్నతాధికారులు సీఎం కేసిఆర్ తో భేటీ అయ్యారు.

కరోనా కాలంలో మెట్రో ఎదుర్కోంటున్న ఆర్థిక నష్టాలను, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల వివరాలను సమావేశంలో చర్చించి తమను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు, ఎంఎ అండ్ యుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, మెట్రో అధికారులు ఎల్ అండ్ టి సీఈఓ అండ్ ఎండి సుబ్రహ్మణ్యం, ఎన్వీఎస్ రెడ్డి, సంస్థ డైరక్టర్ డికె సెన్, ప్రాజెక్టుల సీఈఓ అజిత్, హైదరాబాద్ మెట్రో సీఈఓ కెవిబి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… అనతి కాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తూ ప్రజాదరణ పొందిందన్నారు. కరోనా పరిస్థితులు అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రోను కూడా ఇబ్బందుల్లోకి నెట్టిందని తెలిపారు. దినాదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో మెట్రో మరింతగా విస్తరించాల్సి ఉందన్నారు. కరోనా దెబ్బతో మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయమన్నారు. అన్ని రంగాలను ఆదుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి తమవంతు కృషి చేస్తుందన్నారు. ఎటువంటి విధానాలు అవలంభించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలుగుతామో విశ్లేషిస్తామని తెలిపారు. సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.

ప్రజావసరాల దృష్ట్యా కరోనా వంటి క్లిష్ట సందర్భాల్లో వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందన్నారు. హైదరాబాద్ మెట్రోను ఆదుకోవడంతో పాటు తిరిగి పుంజుకుని ప్రజావసరాల దృష్ట్యా మరింతగా విస్తరించే దిశగా చర్యలు చేపడతామని సీఎం తెలిపారు. ఇందుకు గాను విస్తృతంగా చర్చించి పుర్వాపరాలను పరిశీలించి ఏ విధానం అవలంభించడం ద్వారా మెట్రోకు పూర్వవైభవాన్ని తీసుకురాగలమో అవగాహన కోసం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎంఎయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ వుంటారని సిఎం తెలిపారు. మెట్రోను నష్టాలనుంచి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు బాధ్యతగా ఆదుకునే అంశంపై అన్ని రకాలుగా పరిశీలించి అధ్యయనం చేసి అతి త్వరలో నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *