వనపర్తి జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండా పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లాలోని దావాజి పల్లి, గోపాల్ పేట మండలం తాడిపర్తి, పెద్దమందడి మండలం జగత్ పల్లి గ్రామాలలో టీఆర్ఎస్ జెండా పండగను పండగలా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఢిల్లీ వరకు చేరిందంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ జెండా పండగలో కుల సంఘాలు, రైతులు కూడా పాల్గొని కేసీఆర్ తమ వర్గాలకు చేస్తోన్న అభివృద్దిని ప్రశంసించారు.
వనపర్తి జిల్లాలో టీఆర్ఎస్ జెండా పండగను ఘనంగా నిర్వహించారు.పార్టీ జెండాను ఆవిష్కరించి టీఆర్ఎస్ ప్రస్థానం గురించి వివరించారు. ఒక్కడితో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ నేడు లక్షలాది మంది సమూహంగా మారి ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిందని కేసీఆర్ కృషిని కొనియాడారు. అనంతరం వనపర్తిలో అంబేద్కర్ చౌరస్త నుండి రాజీవ్ చౌరస్త వరకు 500 మంది దళితబంధు పథకాన్ని ఆహ్వానిస్తూ ర్యాలీ నిర్వహించారు. అలాగే వనపర్తి సమీపంలోని దావాజి పల్లిలో పంట పొలాలలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.. రైతాంగానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అందుకే పంట పొలాల్లో టీఆర్ఎస్ జెండా పండగను జరుపుకుంటున్నామని అన్నారు.
గోపాల్ పేట మండలం తాడిపర్తి, పెద్దమందడి మండలం జగత్ పల్లి గ్రామాలలో గొర్రెల మంద వద్ద టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు గొల్ల కురుమలు. వనపర్తి నల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి.. ఉచితంగా చేప పిల్లల పంపిణీతో మత్స్య కారుల కుటుంబాలకు చేదోడుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు మత్స్యకారులు.