టీఆర్ఎస్ జెండా పండగ రోజున ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంకు చేదు అనుభవం ఎదురైంది. చేసింది చెప్పుకోవం బాగానే ఉంది కానీ..ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ఎమ్మెల్యేను నిలదీశారు రైతులు. ఒక్కసారిగా వారంతా ఎమ్మెల్యేను అలా నిలదీసే సరికి టీఆర్ఎస్ నేతలతోపాటు ఎమ్మెల్యే సైతం ఆశ్చర్యపోయారు.
పార్టీ అధిష్టానం మేరకు జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఉండవెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అబ్రహం జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసగిస్తుండగా…ఓ వైపు నీళ్ళు లేక ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక మా చేన్లు ఎండిపోతుంటే మీరు మాత్రం పండగ చేసుకుంటారా అంటూ ఎమ్మెల్యేను నిలదీశారు రైతులు. ప్రాజెక్టులు నింపి నీళ్లు ఇస్తామన్నారు.. తుమ్మెళ్ళ ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తలేవు..పంటలు ఎండిపోతున్నాయి ఎం చేయాలి చెప్పండి అంటూ అక్కడే ఉన్న ఎమ్మెల్యేల ఎదుట ప్రశ్నల వర్షం కురిపించారు. వర్షాలు లేక, ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాక ఇబ్బందులు పడుతుంటే మీరు పండుగలు చేస్తారా..? మీరు ప్రజల సొమ్ముతో ఆనందంగా గడుపుతున్నారు. మా బాధలను ఎవరు తీర్చాలని ఎమ్మెల్యేను రైతులు ఘాటుగా నిలదీశారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో ఎమ్మెల్యే అక్కడినుండి వెళ్లిపోయారు.